శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 22, 2020 , 15:38:33

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: గవర్నర్

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి: గవర్నర్

హైద‌రాబాద్ : భారతదేశంలో మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మరింతగా చొరవ చూపి, పారిశ్రామిక‌వేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం అని ఆమె అన్నారు. దేశంలో మొత్తం పారిశ్రామికవేత్తల్లో మహిళలు కేవలం 20 శాతం లోపు ఉండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. 

భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సిఎస్ఐఆర్-నీరి (సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ల సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశం ‘భారత మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్, సైంటిస్ట్ ల కాంక్లేవ్’ గా నిర్వహించారు. 

‘ఆత్మ నిర్భర్ భారత్‌లో మహిళల పాత్ర’ అన్న అంశంపై తమిళిసై మాట్లాడుతూ.. మహిళలకు మరిన్ని ప్రోత్సాహకాలు, ఫండింగ్, వసతుల కల్పన ద్వారా వారిని ఎంటర్ ప్రెన్యూర్స్ గా ప్రోత్సహించాలన్నారు. భారతదేశంలో దాదాపు 70 శాతం మంది మహిళలు ఆదాయం వచ్చే పనులకు దూరంగా ఉన్నారు. వీరంతా ఆర్ధికపరమైన వర్క్ ఫోర్స్ గా మారితే దేశం దాదాపు 30 శాతం ఆర్ధికంగా బలోపేతమ‌వుతుందని గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. మహిళలు ఔత్సాహికులుగా ఎదిగితే వారి కోసం అనేక ఉద్యోగాల కల్పన చేసి వారి ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడతారు. 

మొత్తం సైంటిస్ట్ ల్లో మహిళలు 14 శాతం మాత్రమే 

బాలికల్లో చిన్నప్పటి నుంచే సైన్స్, పరిశోధనల పట్ల ఆసక్తి కల్గించి సైంటిస్ట్ లుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలన్నారు. వారు కేవలం 14 శాతం మందే ఉండటం సైన్స్, పరిశోధన, అభివృద్ధి రంగాలలో భారత్ ఎదుగుదలకు మంచిది కాదు. మహిళల్లో మరింత ఎక్కువ సైంటిస్ట్ లు తయారుకావాలి. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా, సైంటిస్ట్ లుగా మరింత ఎక్కువ సంఖ్యలో రావడం స్వయం సమృద్ధి, స్వయం ఆధారిత భారత్ లక్ష్యసాధనలో అత్యంత కీలకమన్నారు. సమాజంలో వివక్ష తొలగాలి, కుటుంబ ప్రోత్సాహం, వనరుల కల్పన, సైన్స్ కోసం మహిళల కోసం మరిన్ని స్కాలర్ షిప్ లు, ప్రత్యేక కళాశాలలు ఈ దిశగా అవసరమని తమిళిసై అన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా “భారత్ లో మహిళా సైంటిస్ట్ లు” ఈ-బుక్ ను గవర్నర్ ఆవిష్కరించారు. కేంద్ర జౌళి, మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే, నీరి డైరెక్టర్ డాక్ట‌ర్ రాకేష్ కుమార్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ రేణు స్వరూప్, డాక్ట‌ర్ ఆధిత్య కాప్లే, ఇతర సైంటిస్ట్ లు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. 


logo