సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 02:00:36

సర్కారు దవాఖానల్లో సేవలు భేష్‌

సర్కారు దవాఖానల్లో సేవలు భేష్‌

  • అక్కడ నమ్మకంగా చికిత్స
  • వైద్యులకు, సిబ్బందికి గవర్నర్‌ అభినందనలు
  • మానవతా దృక్పథంతో చికిత్స చేయాలని ప్రైవేట్‌ 
  • దవాఖానలకు సూచన ప్లాస్మాదాతలకు రాఖీ కట్టిన తమిళిసై

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్‌ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం కరోనా బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతాధృక్పథంతో సేవలు అందించాలని కోరారు. 

కరోనా బాధితులకు జీవంపోస్తున్న ప్లాస్మా దాతలు ఇతరులకు స్ఫూర్తిప్రదాతలని అభినందించారు. రాజ్‌భవన్‌ రాఖీ ఉత్సవాల్లో పాల్గొన్నవారంతా.. కరోనా వైరస్‌ బారిన పడినప్పుడు గాంధీ దవాఖానలోనే చికిత్స తీసుకున్నారు. వీరిలో ఆరుగురు రెండు, అంతకంటే ఎక్కువసార్లు ప్లాస్మా దానంచేశారు. ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానంతో వారు నింపుతున్న స్ఫూర్తిని గవర్నర్‌ అభినందించారు. కరోనా చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి ప్రేరణ ఇచ్చిన అంశాలపై గవర్నర్‌ వారితో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి కరోనా బాధితుడు గంపాల రాంతేజ, బీ నితిన్‌కుమార్‌, మొదటి ప్లాస్మా దాత ఎన్నంశెట్టి అఖిల్‌, సురం శివప్రతాప్‌, సయ్యద్‌ ముస్తఫా ఇర్ఫాన్‌, ఉమర్‌ ఫరూఖ్‌, డాక్టర్‌ సుమిత్‌, జే రాజ్‌కుమార్‌, పీ రామకృష్ణగౌడ్‌ (ఎస్సై), ఎస్‌ శివానంద్‌, డాక్టర్‌ సాయి సోమసుందర్‌, డాక్టర్‌ రూపదర్శని గవర్నర్‌ను కలిశారు. వీరిలో బీ నితిన్‌కుమార్‌ నాలుగుసార్లు ప్లాస్మా దానం చేశారు.


logo