బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 22:00:36

బాలల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్‌

బాలల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్ : బాలల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. శనివారం జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. యేటా పిల్లల మధ్య ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించుకునే వాళ్లమని.. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నిరాడంబరంగా నిర్వహించుకోవాల్సి వచ్చిందని అన్నారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు గతంలో నెలకు 8 గుడ్లు ఇవ్వగా 2015 నుంచి 30 గుడ్లు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అంగన్‌ కేంద్రాలను ప్రాథమిక విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్ది చిన్నారుల విద్యా వికాసానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇంద్రధనస్సు పథకం కింద నవజాత శిశువుల నుంచి ఆరేళ్ల బాలల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో టీకాలు వేయిస్తూ రోగాల బారి నుంచి కాపాడుతున్నట్లు వివరించారు. పుట్టిన శిశువులు, బాలలకే కాకుండా పుట్టబోయే శిశువులు సైతం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గర్భిణులకు కూడా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ.. ఎప్పటికప్పుడు వారి వైద్య సాయం అందిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ బాలల భవితవ్యానికి భరోసా కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో రేపటి తరం ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.