శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 20:26:51

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ కవిత

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ : బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గడిచిన ఆరేండ్లలో రూ. 250 కోట్లతో 2 వేలకు పైగా ఆలయాలను పునురుద్ధరించామని తెలిపారు. 14 వేద పాఠశాలలకు  ప్రభుత్వ అన్నిరకాలుగా సాయం అందిస్తోందని పేర్కొన్నారు. అడిక్‌మెట్‌ డివిజన్‌లో శనివారం నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించింది. ఓవర్సీస్ విద్యా పథకం ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికసాయం అందిస్తోంది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర అంధకారం అవుతుందని కొందరు విష ప్రచారం చేశారు. నిరంతర విద్యుత్ అందిస్తూ సీఎం కేసీఆర్‌ అపోహలను పటాపంచలు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కులాలను, మతాలను అడ్డుపెట్టుకొని ఓట్లు దండుకునేందుకు యత్నిస్తుంది. హైదరబాద్‌లో అందరం అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం. ఆరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏ విషయంలోనూ న్యాయం చేయలేదు. ప్రజల ఆశీర్వాదంతో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచాం. ఈ సారి 100 డివిజన్లకు పైగా గెలుస్తాం. అడిక్‌మెట్‌ డివిజన్‌ టీఆర్ఎస్ అభ్యర్థి హేమలతారెడ్డిని ఆశీర్వదించాలి. భారీ మెజారిటీతో కార్పొరేటర్‌గా గెలిపించాలి’ అని ఎమ్మెల్సీ కవిత కోరారు. సమాశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.