శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 01:43:45

ఒక్క వెల్డింగ్‌ 100 టీఎంసీలు

ఒక్క వెల్డింగ్‌ 100 టీఎంసీలు

  • ఆల్మట్టిలో కర్ణాటక కుటిలనీతి
  • సుప్రీంలో స్టేను పక్కనపెట్టి అదనపు నీటినిల్వకు యత్నాలు
  • కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆటలు
  • చోద్యం చూస్తున్న జల్‌శక్తి.. దిగువ రాష్ర్టాలపైనే పెత్తనం
  • ఒక్క వెల్డింగ్‌తో.. వంద టీఎంసీలు నిల్వ!
  • అధికారం ఉందని ఆటలు

ఒక ప్రాజెక్టుకు వచ్చే వరదను నిల్వచేసేందుకు ఆ ప్రాజెక్టు ఎత్తువరకు క్రస్ట్‌గేట్లను ఏర్పాటుచేస్తారు. పూర్తిస్థాయిలో నిండాక వాటిని పైకిలేపి నీటిని విడుదల చేస్తుంటారు. కానీ, కృష్ణాబేసిన్‌లో మొట్టమొదటి ప్రాజెక్టు అయిన ఆల్మట్టిలో క్రస్ట్‌గేట్లు ప్రాజెక్టు ఎత్తువరకు ఉండకుండా.. కొంచెం కట్‌చేసినట్టుంటాయి. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అమల్లోకి రానికారణంగా కర్ణాటక ప్రభుత్వమే గేట్లను ఇలా కట్‌ చేయాల్సి వచ్చింది. దీంతో జలాశయంలో గరిష్ఠంగా 519.684 మీటర్ల స్థాయిలోనే నీటి నిల్వచేసుకుంటున్నది. దీని పుణ్యాన కృష్ణాజలాలు కొద్దిగానైనా ముందుగా దిగువన తెలుగు రాష్ర్టాలకు విడుదలవుతున్నాయి. 

‘ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎడారే’ అని అందరూ అంటుంటారు. నిజానికి కర్ణాటక ఆల్మట్టి ఎత్తును ఎప్పుడో పెంచి.. గేట్లు కూడా బిగించింది. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అమల్లోకి రాని కారణంగా క్రస్ట్‌గేట్లను కట్‌చేసి వాటి ఎత్తును తగ్గించింది. తాజాగా, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నదనే ధీమాతో వాటికి వెల్డింగ్‌చేసి.. మళ్లీ నిల్వ పెంచేందుకు యత్నిస్తున్నది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లను ఇలా వెల్డింగ్‌చేస్తే ఆల్మట్టిలో అదనంగా పెరిగే నీటినిల్వ ఎంతో తెలుసా? అక్షరాలా వంద టీఎంసీలు..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టిలో అదనంగా నీటినిల్వను పెంచి తెలుగు రాష్ర్టాలను ఎడారిగా మార్చేందుకు కర్ణాటక కుటిలయత్నాలు పన్నుతున్నది. కేంద్రంలో తమ పార్టీయే అధికారంలో ఉన్నదనే సాకుతో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ను లెక్కచేయకుండా ఆల్మట్టి ఎత్తుపై అధికారిక ప్రకటనలు చేస్తున్నది. వాటిని అడ్డుకోవాల్సిన కేంద్ర జల్‌శక్తి చోద్యం చూస్తూ తెలుగురాష్ర్టాలపైనే పెత్తనం చేయడానికే పరిమితమవుతున్నది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 524 మీటర్లు పెంచేందుకు కర్ణాటక యత్నించగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. 516 మీటర్లు ఎత్తు వరకు తమకు అభ్యంతరం లేదని నాటి ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 519.684 మీటర్ల (ప్రస్తుతం నిర్వహిస్తున్న గరిష్ఠ నీటిమట్టం) ఎత్తు వరకు పెంచుకోవచ్చంటూ 2000 సంవత్సరంలో సూచించిన సుప్రీంకోర్టు.. 524.256 మీట ర్ల అంశాన్ని మా త్రం ట్రిబ్యునల్‌కు వదిలిపెట్టింది. తర్వాత బ్రిజేష్‌ (కేడబ్ల్యూడీటీ-2) ట్రిబ్యునల్‌ 524. 256 మీటర్ల వరకు అనుమతివ్వడంతో 2002 ప్రాంతంలోనే కర్ణాటక ప్రభుత్వం డ్యాంను ఆ ఎత్తుకు పెంచి, గేట్లను కూడా బిగించింది.

కానీ బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్లడంతో దానిపై ఉన్న స్టే కారణంగా కర్ణాటక ఆల్మట్టిలో 519.684 మీటర్ల మేరనే గరిష్ఠంగా 129.72 టీఎంసీల నీటి నిల్వ చేసుకుంటూ వస్తున్నది. ఇందుకోసం జలాశయం మొత్తం 26 క్రస్ట్‌గేట్లను ఆ మేరకు కట్‌చేసింది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం పెండింగ్‌లోనే ఉన్నది. కానీ, ప్రస్తు తం కేంద్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉండటంతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తున్నది. కొన్నిరోజులుగా ఆ రాష్ట్రమంత్రులు ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటూ అధికారిక ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆల్మట్టి ఎత్తుపై నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ కేంద్ర జల్‌శక్తికి లేఖ రాయడం చర్చనీయాంశమవుతున్నది. 

నోరు మెదపని తెలంగాణ బీజేపీ

ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ర్టాల్లోని ప్రాజెక్టులు వెలవెలబోతాయనేది వాస్త వం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుంది. రాయలసీమ పథకంపై ఏపీ జారీచేసిన జీవో 203 అమలును అడ్డుకుంటున్నామంటూ హడావుడి చేసిన తెలంగాణ బీజేపీ నాయకులు.. సుప్రీంలో కేసు పెండింగ్‌లో ఉన్న అంశాన్ని పక్కకుపెట్టి కర్ణాటక బీజేపీ ప్రభుత్వం హడావుడి చేస్తుంటే మాత్రం నోరు మెదపడం లేదు. కేంద్రంలో తమపార్టీయే అధికారంలో ఉన్నదనే ధీమాతో నేరుగా కేంద్రమంత్రికి లేఖ రాసినట్టు ప్రచారం చేసుకుంటున్నా.. తెలంగాణ బీజేపీ నాయకులు ఖండించిన పాపానపోవడం లేదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనకాల కోసం కనీసం అధిష్ఠానం ముందు నోరుకూడా విప్పలేకపోతున్నారని మండిపడుతున్నారు. 


logo