శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 20:31:06

ఆ అనాథ పిల్లలకు అండగా ప్రభుత్వం : మంత్రి కేటీఆర్

ఆ అనాథ పిల్లలకు అండగా ప్రభుత్వం : మంత్రి కేటీఆర్

కుమ్రంభీం అసిఫాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో మారు తన ఔదర్యాన్ని చాటారు. అయిన వాళ్లని కోల్పోయి అనాథలుగా మారిన ఆరుగురు ఆడపిల్లలకు పెద్దన్నగా నేనున్నానంటూ భరోసానిచ్చారు. జిల్లాలోని పెంచికల్ పేట మండలం ఎల్కపల్లి గ్రామంలో తల్లిదండ్రుల మరణంతో అనాథలుగా మారిన ఆరుగురు ఆడ పిల్లలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 

ఎల్కపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి రాజ౦ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందగా వారం రోజుల క్రితం అతని భార్య రాజ్యలక్ష్మి అనారోగ్యంతో చనిపోయింది. దీంతో వీరికి ఉన్న ఆరుగురు ఆడపిల్లలు ఐశ్వర్య, మానస, హారిక, మౌనిక, హరిని, స్వేచ్ఛశ్రీ లు అనాథలు అయ్యారు. ఎలాంటి ఆధారం లేని ఈ పిల్లలకు పిల్లల గురించి సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వస్తున్న కథనాలకు స్పందించిన మానవతా వాదులు ఎంతో కొంత సాయమందించారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా స్పందించి వారికి అండగా నిలిచింది.

 ఈ నేపథ్యంలో విషయం తెలిసిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ కుటుంబానికి ప్రభుత్వమే అండగా నిలుస్తుందని తెలిపారు. పిల్లలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలను జిల్లా కలెక్టర్ ద్వారా చేపడతామని తన ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ స్పందనతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. కష్టకాలంలో అండగా ఉంటామన్న మంత్రి మంచి మనసుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


logo