శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 01:43:25

ఈడబ్ల్యూఎస్‌ల‌కు 10% రిజ‌ర్వేష‌న్లు.. త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు

ఈడబ్ల్యూఎస్‌ల‌కు 10% రిజ‌ర్వేష‌న్లు.. త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు

  • రాష్ట్రంలోనూ అమలు
  • ఆర్థిక బలహీనులకు 10% కేటాయింపు
  • ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలకు వర్తింపు
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం
  • ఇప్పుడున్న రిజర్వేషన్లు యథాతథం
  • రేపో మాపో ఉన్నతస్థాయి సమీక్ష 
  • రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాల వెల్లువ
  • ఇక మొత్తం రిజర్వేషన్లు 60%
  • అర్హతకు ప్రాతిపదిక 
  • వార్షికాదాయం: రూ.8 లక్షలు 
  • మున్సిపాలిటీలు: 100 గజాల లోపు ఇంటి స్థలం ఉన్నవారు
  • కార్పొరేషన్లు: 1000 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్నవారు
  • గ్రామాలు: ఐదెకరాల లోపు వ్యవసాయభూమి ఉన్నవారు
  • మున్సిపాలిటీయేతర ప్రాంతాలు: 200 చదరపు గజాల లోపు ఇల్లు లేదా జాగ ఉన్నవారు 

హైదరాబాద్‌, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్‌ అమలుచేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రెండుమూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగిన ఆదేశాలు జారీచేయనున్నట్టు సీఎం తెలిపారు. ‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‌లకు పది శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

త్వరలోనే ఉత్తర్వులు

సీఎం ఆదేశాలకనుగుణంగా రెండుమూడ్రోజుల్లో సమీక్షించి ఆదేశాలు జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడినవర్గాలను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‌లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ర్టాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలుచేస్తున్నాయి. తెలంగాణలో కూడా దాదాపుగా ఇదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం ఉన్నది. సీఎం నిర్ణయానికి అనుగుణంగా, కేంద్రచట్టం పరిధిలో రాష్ట్రంలోని ఆయా అగ్రవర్ణాల్లోని ఏయే వర్గాలకు ప్రయోజనం కలుగుతుంది అనేది అధికార యంత్రాంగంచేసే కసరత్తు ఆధారంగా తేలనున్నది. 


ప్రస్తుత కోటాకు ఢోకాలేదు

ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే  ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తారు. ఇప్పటి వరకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్‌ సౌకర్యం పొందని వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వాడీ, మార్వాడీ జైన్‌, ముస్లిం మైనారిటీల్లోని సయ్యద్‌, ఖాన్‌ మొదలైన వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. సమగ్ర కుటుంబ సర్వే-2014 ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 10 శాతం, ఎస్టీలు 12శాతం, బీసీలు 51 శాతం ఉండగా.. ఇతరులు 22 శాతం ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు

అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో రెడ్డిజేఏసీ నాయకులు సమావేశమై అగ్రవర్ణ పేదలను ఆదుకోవడానికి సీఎం తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఫౌండర్‌ చైర్మన్‌ నావల్గ సత్యనారాయణరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షుడు పడిదం కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నందికొండ శ్రీనివాస్‌రెడ్డితోపాటు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.  సీఎం నిర్ణయాన్ని తెలంగాణ బ్రాహ్మణ సేవాసంఘ సమా ఖ్య ప్రాంతీయ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు అన్నారు. ఎవరికీ నష్టం కలుగకపోగా అగ్రవర్ణాలతోపాటు ఇతరులు కూడా లబ్ధిపొందుతారని ఈ డ బ్ల్యూఎస్‌ ఫెడరేషన్‌ జాతీయ చైర్మన్‌ మల్లాది చెప్పారు. తెలంగాణ బ్రాహ్మణ అఫీషీయల్స్‌ ప్రొఫెషనల్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్‌, అధ్యక్షుడు బీ రాధాకృష్ణమూర్తి కేసీఆర్‌  నిర్ణయాన్ని స్వాగతించారు. 

కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వింజమూరి సుధాకర్‌, ముఖ్య సలహాదారు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణ యం వల్ల అగ్రవర్ణ పేద యువతకు లాభం కలుగుతుందని దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, రెడ్డి జనసంఘం సలహాదారు ప్రొఫెసర్‌ కంచర్ల దశరథ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు.  సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఓసీ సం క్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, ప్ర ధానకార్యదర్శి కాచం సత్యనారాయణగుప్త, బ్రాహ్మ ణ పరిషత్‌ ప్రతినిధి దక్షిణామూర్తి పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు 

అగ్రవర్ణపేదలకు విద్య, ఉద్యోగ రం గాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. రెండు దశాబ్దాలుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. 

- జీ కరుణాకర్‌రెడ్డి, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

ఎందరికో లబ్ధి

ఆర్థికంగా వెనుకబడినవారికి తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలుచేయడం హర్షణీ యం. సీఎం కేసీఆర్‌ ప్రకటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పదిశాతం రిజర్వేషన్లు అమలుచేయడం ద్వారా ఎందరికో లబ్ధి చేకూరుతుంది. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని రెడ్డి జేఏసీ తరఫున ముక్తకంఠంతో సమర్థిస్తున్నాం. 

- బద్దురి వెంకటేశ్వర్‌రెడ్డి (రెడ్డి జేఏసీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు)

వరప్రదాయిని 

ఆర్థికంగా నిరుపేదలుగా ఉన్న అగ్రవర్ణాలకు ముఖ్యమంత్రి నిర్ణయం వరప్రదాయిని. ఈడబ్ల్యూఎస్‌ 10శాతం అమలు హర్షణీయం. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాలన్న దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారు. 

- కోలేటి దామోదర్‌, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌

అన్ని వర్గాల్లో సంతోషం

 ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణలో ప్రజల పట్ల, వారి సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్‌ నిబద్ధతకు ఈడబ్ల్యుఎస్‌ అమలు నిర్ణయం నిదర్శనం. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో అన్ని వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది.  

- ఉప్పల శ్రీనివాస్‌గుప్త, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ 

సామాజిక సమతూకం 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయంతో సామాజిక సమతూకం జరుగుతుంది. అగ్రవర్ణాల పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఇప్పటికే బ్రహ్మణ సంక్షేమానికి నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్నారు. 

- గంగు ఉపేంద్రశర్మ, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు 

జూన్‌కల్లా సీతారామ కాల్వలు

దుమ్ముగూడెం పాయింట్‌ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలంగా అందుబాటులో ఉండే నీటితో యావత్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించవచ్చు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తిపోసి అటు ఇల్లెందు వైపు, ఇటు సత్తుపల్లివైపు.. మరోపక్క పాలేరు రిజర్వాయర్‌కు లిఫ్టుకాల్వల ద్వారా తరలించాలి. సత్తుపల్లి, ఇల్లెందు వైపువెళ్లే కాలువలకు సంబంధించి మిగిలిన పనుల సర్వేను వెంటనే పూర్తిచేసి, టెండర్లు పిలవాలి.

-సీతారామ ప్రాజెక్టుపై సమీక్షలో సీఎం

VIDEOS

logo