శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 16:30:25

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి సత్యవతి

వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి సత్యవతి

ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల ములుగు జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వర్షం వల్ల రోడ్లు, పంటలు, వ్యక్తిగత ఆస్తుల నష్టాన్ని అంచనావేసి త్వరలోనే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాలోని ఇబ్బందులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా బాగా దెబ్బతిన్నదని మంత్రి పేర్కొన్నారు. రామప్పకూడా దెబ్బతిన్నది. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు, కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పని చేశారు. పని చేసిన వారందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. రోడ్లు బాగా పాడయ్యాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా ఏజన్సీలతో నష్టం అంచనా వేస్తున్నామని వివరించారు. దీంతో పాటు వెంటనే చేపట్టే తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


శాశ్వత ప్రాతిపాదికన భవిష్యత్ లో మరోసారి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరి నష్టపోయింది, దీనిని అంచనా వేసి పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అధికారులు సమగ్రమైన నివేదికను ఇప్పటికే తయారు చేశారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో చర్యలు తీసుకుంటామన్నారు.ఈ వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున, పటిష్టంగా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నిన్నటి నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభించాం. ఇందుకోసం నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించాం. ఏజెన్సీ ప్రాంతాల్లో డిజిటల్ తరగతులు అందరికీ చేరే విధంగా చూడాలన్నారు. 

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడు నమోదు  చేసి తగిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంగన్ వాడీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కేవలం 23శాతం మాత్రమే అటవీ ప్రాంతమున్నదని, దీనిని 33 శాతానికి పెంచాలని సీఎం కేసిఆర్ సంకల్పించారు. హరితహారంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ఈ అటవీ ప్రాంతాన్ని పెంచాలన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో అడవిని కాపాడుకోవాలని మంత్రి సూచించారు. logo