శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:01:59

భూదందా కేసులో ఆర్డీవో సస్పెన్షన్‌

భూదందా కేసులో ఆర్డీవో సస్పెన్షన్‌

  • డిప్యూటీ తాసిల్దార్‌ కూడా..
  • ఖాజీపల్లి భూ కేటాయింపుపై చర్యలు
  • రూ.80 కోట్ల భూమి తిరిగి సర్కారు చేతికి
  • ఆగస్టు 6నే వెలుగులోకి  తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలో అక్రమ భూకేటాయింపు వ్యవహారంలో అప్పటి తాసిల్దార్‌, డిప్యూటీ తాసిల్దార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సదరు తాసిల్దార్‌ ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తున్నారు. వీరికి సహకరించిన కిందిస్థాయి సిబ్బందిపైనా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. సదరు అధికారులు ఇచ్చిన పట్టాలను రద్దుచేయడంతోపాటు రూ.80 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి తిరిగి సర్కార్‌ సొంతమైంది. వివరాలిలా.. నాగేందర్‌రావు, ఉప్పు రంగనాయకులు, తోట వెంకటేశ్వర్లు, ఎం మధుసూదన్‌ మాజీ సైనికులు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లిలోని 181 సర్వేనంబర్‌లో ఒక్కొక్కరికి ఐదెకరాల చొప్పున ప్రభుత్వం కేటాయించిన భూమికి ఎన్వోసీ ఇవ్వాలని 2019లో కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. అసైన్‌మెంట్‌ నిషేధిత జాబితాలో ఉన్న ఖాజీపల్లిలోని ఈ భూమి కేటాయింపుపై కలెక్టర్‌ హనుమంతరావు ఆరాతీయగా.. అక్రమ భాగోతం వెలుగు చూసింది. 2005 జనవరి 3న మాజీ సైనికులకు ఖాజీపల్లిలో భూ కేటాయింపు కోసం అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం తెలిపేలా అప్పటి జిన్నారం తాసిల్దార్‌ నరేందర్‌, డిప్యూటీ తాసిల్దార్‌ కే నారాయణతోపాటు ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వర్లు, జిన్నారం ఆర్‌ఐ జీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్వేయర్‌ లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌ ఎం ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ సహదేవ్‌ తప్పుడు పత్రాలు సృష్టించారు. ఖాజీపల్లి అసైన్‌మెంట్‌ జాబితాలోనే ఉన్నట్లుగా రికార్డుల్లో ట్యాంపరింగ్‌ చేశారు. అసైన్‌మెంట్‌ కమిటీ 2005లో ఆమోదం తెలిపితే 2007 డిసెంబర్‌లో పట్టాలు వచ్చినట్లు చూపించారు. అయితే ఈ ఫైలును 2013లో కొత్తగా తెరిచారు. 2007లో ఉన్న అప్పటి తాసిల్దార్‌ పరమేశ్వర్‌ సంతకాలు ఫోర్జరీ చేశారు. పరమేశ్వర్‌ అప్పటికే చనిపోయారు. ఆయన ఇ చ్చిన భూమికి హద్దులు చూపించాలని 2013లో మాజీ సైనికులు దరఖాస్తు పెట్టుకోగా, తాసిల్దార్‌ హద్దులు చూపించారు. ఎవరికీ అనుమానం రాకుండా 2007 నుంచి పహాణీ మొదలుకొని, అన్ని రికార్డుల్లో ఆ భూమి సైనికుల పేరిట ఉన్నట్లు ట్యాంపరింగ్‌ చేశారు. విచారణలో అక్రమాలు వెలుగులోకి రావడంతో అప్పుటి తాసిల్దార్‌ (ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవో) నరేందర్‌ను, డిప్యూటీ తాసిల్దార్‌ నారాయణ (మెదక్‌ కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌)ను సస్పెండ్‌చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. ఖాజీపల్లి వీఆర్వో వెంకటేశ్వర్లు, జిన్నారం ఆర్‌ఐ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్వేయర్‌ లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ సహదేవ్‌పై శాఖాపర క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  భూ వ్యవహారాన్ని ఆగస్టు 6న ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది.


logo