మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 01:51:55

హైకోర్టులకు హైకోర్టు జరిమానా!

హైకోర్టులకు హైకోర్టు జరిమానా!

  • ఉమ్మడి హైకోర్టు రిటైర్డ్‌ ఉద్యోగులకు ఊరట
  • తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కీలక తీర్పు
  • ఏపీకి ఇచ్చిన ఆప్షన్‌ పరిగణనలోకి తీసుకోవాలి
  • 60 ఏండ్లు రిటైర్డ్‌ వయస్సుగా గుర్తించి జీతాలివ్వాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రెండు తెలుగు రాష్ర్టాల హైకోర్టులకు జరిమానా విధించింది. నవంబర్‌ 1, 2018కి ముందు పదవీవిరమణ పొందినవారికి ఏ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకొనే ఆప్షన్‌ ఇవ్వకుండా అప్పటి ఉమ్మడి హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. వారికి ఆప్షన్‌ వినియోగించుకొనే హక్కును కల్పించనందుకు ఏపీ, తెలంగాణ హైకోర్టులు వేర్వేరుగా ఒక్కొక్క పిటిషనర్‌కు రూ.3 వేల చొప్పున జరిమానా (ఖర్చులకు) చెల్లించాలని ఆదేశించింది. 2018కి ముందు రిటైర్‌ అయినవారి ఆప్షన్‌ను పరిగణనలోకి తీసుకొని, వారు కోరినవిధంగా ఏపీ హైకోర్టుకు కేటాయించాలని తెలిపింది. వారి రిటైర్‌మెంట్‌ వయస్సును 60 ఏండ్లుగా పరిగణించి.. రావాల్సిన జీతభత్యాలు లెక్కించి చెల్లించాలని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టులో రిటైర్‌ అయిన ఉద్యోగి కే బలరామరాజు, మరో 9 మంది హైకోర్టు విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లేందుకు తమకు ఆప్షన్‌ ఇవ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ 2019లో తెలంగాణ, ఏపీ హైకోర్టులను ఆశ్రయించారు. తమను ఏపీ హైకోర్టుకు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. రెండు హైకోర్టుల్లో వారి పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వారు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. విచారణచేపట్టిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ టీ అమర్‌నాథ్‌గౌడ్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌.. ఉమ్మడి హైకోర్టులో రిటైర్‌ అయిన పిటిషనర్లకు ఆప్షన్‌ హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. తెలంగాణ, ఏపీ ప్రత్యేక రాష్ర్టాలుగా ఏర్పడిన జూన్‌ 2, 2014వ తేదీని ఉద్యోగుల కేటాయింపునకు అపాయింటెడ్‌ డేగా పరిగణనలోకి తీసుకోవాలే తప్ప రెండు రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పడిన జనవరి 1, 2019వ తేదీని కాదని పేర్కొన్నది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పిటిషనర్లను ఏపీ హైకోర్టుకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

భౌతికంగా తెరుచుకోనున్న హైకోర్టు

కరోనాతో ఆగిపోయిన హైకోర్టు భౌతిక విచారణ మళ్లీ ప్రారంభం కానున్నది. వచ్చేనెల 7 నుంచి వారంపాటు పరిమిత ధర్మాసనాలతో భౌతిక విచారణ చేపట్టాలని హైకోర్టు విస్తృతస్థాయి సమావేశం శనివారం నిర్ణయించింది. డివిజన్‌ బెంచ్‌, 4 ఏకసభ్య ధర్మాసనాలు విచారణ చేపట్టనున్నాయి. భౌతిక విచారణకు ఏర్పాట్లుచేస్తున్నట్టు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మలుగారి సుదర్శన్‌ తెలిపారు.logo