ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 18:07:37

రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు విడుదల

రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు విడుదల

హైదరాబాద్‌: రైతువేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించి రూ.350 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. 

రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్ల పరిధిలో 2604 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం అదేశించింది. ఒక్కో రైతువేదిక కనీసం రెండువేల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. ఒక్కో నిర్మాణానికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని అంచానవేస్తున్నారు. తొలి విడతలో 19 జిల్లాల్లో 958 రైతు వేదికలను నిర్మించనున్నారు.

రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్ల పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామంలో రైతు వేదికలను నిర్మిస్తారు. ఇక్కడ మైకు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశాలు, శిక్షణ, పథకాలపై అవగాహన.. ఇలా రైతులకు చెందిన అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తారు. ఇప్పటివరకు మండలస్థాయిలోనూ ఇలాంటి సమావేశ మందిరాలు లేవు. మండలాల్లో పూర్తిస్థాయి కార్యాలయాలు లేని వ్యవసాయాధికారులకు సైతం ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి.


logo