గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 16:52:18

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి తలసాని

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి తలసాని

రాజన్నసిరిసిల్ల జిల్లా : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్)లో పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీచైర్మన్ అరుణ, చొప్పదండి శాసనసభ్యుడు శ్రీ సుంకే రవిశంకర్, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్.అంజయ్యతో కలిసి 28 లక్షల 50 వేల చేప పిల్లలను విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జలశయాల్లో 80 కోట్ల చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తున్నదని తెలిపారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో బ్రహ్మాండమైన అభివృద్ధిని జరిగిందని, రానున్న రోజుల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి చేపలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. చెరువుల్లో నాణ్యమైన, సరైన పరిమాణం, కౌంటింగ్‌ చేసి చేప పిల్లలను విడుస్తున్నామని, దీనిని వీడియో తీస్తున్నట్లు మంత్రి తెలిపారు. జలకళను సంతరించుకున్న రాజరాజేశ్వర జలాశయాన్ని చూస్తే సంతోషంగా ఉందని  ఆయన  పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఎన్ అరుణ, ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఖదీర్ అహ్మద్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.