బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 02:46:26

‘కోడ్‌' కూసింది

‘కోడ్‌' కూసింది

  • గ్రేటర్‌లో అమల్లోకి ఎన్నికల ప్రవర్తనా నియమావళి
  • శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్‌
  • నగదుపై నిఘా.. రూ.50 వేలు దాటొద్దు
  • ప్రభుత్వ కార్యక్రమాలు, నగదు పంపిణీపై ఆంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యకలాపాలు, నగదు సరఫరాపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు చేయొద్దని, కొత్త పథకాలు ప్రకటించవద్దని ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి తెలిపింది. నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి రాజకీయ పార్టీ ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని స్పష్టం చేసింది. ప్రజల నగదు సరఫరాపైనా ఆంక్షలు ఉంటాయని, ఎవరైనా సరే రూ.50వేలకు మించి నగదును వెంట తీసుకువెళ్లొద్దని సూచించింది. వివాహాలు, వ్యాపారాల కోసం డబ్బును తీసుకెళ్లేవారు ఆధారాలు చూపించకపోతే సీజ్‌ చేస్తామని చెప్పింది. ఏటీఎంలలో డబ్బును నింపేందుకు వెళ్లే బ్యాంకు సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించింది. 

జీహెచ్‌ఎంసీ చట్టం -1955 లో కీలక అంశాలివే

నోటిఫికేషన్‌ విడుదలైన తరువా త నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల గడువు ఇవ్వాలి. పబ్లిక్‌ హాలిడేల నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసిన మరుసటి రోజే వాటిని పరిశీలించాలి.

నామినేషన్ల ఉపసంహరణ రోజే బరిలోని అభ్యర్థుల వివరాలు వెల్లడించాలి. అనంతరం తొమ్మిదోరోజు ఎన్నికలు పెట్టాలి

జీహెచ్‌ఎంసీ చట్టానికి ఇటీవలి సవరణల ప్రకారం మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేయాలి.  

అభ్యర్థి బీ-ఫామ్‌ ఎప్పుడివ్వొచ్చు

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తరఫున  ఫామ్‌-ఏ, ఫామ్‌-బీలు ఇస్తాయి. ఫామ్‌-ఏ అంటే పార్టీ అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ నేరుగా జారీ చేస్తారు. ఫామ్‌-బీ అంటే పార్టీ తరఫున ఏ వార్డులో ఎవరిని నిలబెడుతున్నామో ఇస్తారు. ఫామ్‌-ఏ అయితే నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఉన్న గడువు తేదీలోగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమర్పించాలి. ఫామ్‌-బీ అయితే నామినేషన్ల పరిశీలన పూర్తయ్యే రోజు నాటికి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి నేరుగా సమర్పించవచ్చు. పార్టీ అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ ఫామ్‌-ఏ ఇవ్వకుండా నేరుగా ఫామ్‌-బీ కూడా ఇవ్వొచ్చు.