శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 01:45:20

నిర్ణయం.. తల్లిదండ్రులదే

నిర్ణయం.. తల్లిదండ్రులదే

 • పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి
 • తొమ్మిది ఆపై తరగతులకే బోధన.. హాస్టళ్లకు అనుమతి 
 • నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జనవరి 11 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రుల సమ్మతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, విద్యార్థులకు అటెండెన్స్‌ తప్పనిసరికాదని ప్రభుత్వం తెలిపింది.  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.   విద్యాసంస్థలను ఈ నెల 25లోగా పునఃప్రారంభించేందుకు  సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభంకానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. తమ ఇంట్లో అనారోగ్యంతో ఎవరూలేరని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి.  

 • విద్యార్థులు ఒకరోజు మినహాయించి మరోరోజు హాజరయ్యేలా ప్రత్యేక షెడ్యూల్‌ అమలుచేయాలి.  
 • పాఠ్యపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, టిఫిన్‌బాక్స్‌, నీళ్లబాటిళ్లను పిల్లలు మార్చుకోకుండా చూడాలి.
 • స్కూల్‌బ్యాగ్‌ అవసరంలేదు. అభ్యసనా సామగ్రినంతా తరగతి గదుల్లోనే ఉంచాలి.
 • పాఠశాలను ప్రతిరోజు శానిటైజ్‌ చేయాలి. 

హాస్టళ్లు, గురుకులాల్లో..

 • ఆన్‌లైన్‌ క్లాసులు వినలేని, ఇంట్లో వసతులు లేని వారిని మాత్రమే హాస్టళ్లకు రమ్మనాలి.
 • హాస్టల్లో ప్రవేశించడానికి ముందే విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలి. 

రవాణా ఏర్పాట్లు.. జాగ్రత్తలు

 • పాఠశాల ఏర్పాటు చేసిన రవాణా వ్యవస్థలనే పిల్లలు వినియోగించుకోవాలి. పిల్లలు ఎక్కడానికి ముందు, దిగిపోయిన తర్వాత రోజుకు రెండుసార్లు చొప్పున బస్సులను శానిటైజేషన్‌ చేయాలి.
 • ప్రైవేట్‌ క్యాబ్‌లు, ఆటోలు, కార్‌పూలింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించరాదు. వీలైతే తల్లిదండ్రులే తీసుకువచ్చి, తీసుకెళ్లడం మంచిది.
 • పిల్లలకు వేడివేడి మధ్యాహ్న భోజనాన్నే వడ్డించాలి  విద్యార్థులకు పోర్టబుల్‌ మినరల్‌ వాటర్‌నే అందించాలి.  

తెరుచుకోనున్న విద్యాసంస్థలు 21వేలు 

కరోనా, లాక్‌డౌన్‌తో మూతబడ్డ విద్యాసంస్థలు 11 నెలల విరామం తర్వాత తెరుచుకోబోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 21 వేల విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 25లోగా తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 1నుంచి5 తరగతులకు ప్రత్యక్ష బోధన ఉండదని, 6నుంచి 8వ తరగతులతోపాటు తొమ్మిది ఆపై తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు, కరోనా కేసుల సంఖ్య ఆధారంగా నిర్ణయం తీసుకుంటామంటున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు త్వరలోనే అకాడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా 60రోజులకు మించి పనిదినాలు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. అంతా సవ్యంగా ఉంటే ఏప్రిల్‌లో ఇంటర్‌, ఆ తర్వాత ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. 

ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌? 

కరోనా ఆందోళనల మధ్యే విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సైతం వ్యాక్సిన్‌ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. ఇటీవలే విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ చిత్రారామచంద్రన్‌తో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.


logo