హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఆపదలో ఉన్నామంటూ ట్వీట్ చేసిన గంటల్లోనే ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ ఇతర రాష్ర్టాల ప్రజల నుంచీ ఆదరణ, అభిమానాన్ని చూరగొంటున్నారు. కరోనా కాలంలో వెంటనే స్పందిస్తూ కష్టం అన్న వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆక్సిజన్ అవసరమైనా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కావాలన్నా వెంటనే అందజేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఇతర రాష్ర్టాలవారు సైతం తమ అవసరాల కోసం కేటీఆర్‌కు ట్వీట్ చేస్తున్నారు. ‘మీ సహకారం కావాలి.. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు దోహదపడండి’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.
కేటీఆర్ కార్యాలయం తక్షణ స్పందన
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ట్వీట్లకు సైతం కేటీఆర్ కార్యాలయం వేగంగా స్పందిస్తున్నది. మీ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కావాల్సిన సాయం అందిస్తాం. లేదా సంబంధిత మంత్రితో చెప్తాం అంటూ సమాధానం ఇస్తున్నది. అంతేకాదు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను ట్యాగ్చేస్తూ సాయం చేయాలని కోరుతున్నది. తమ, పర బేధం లేకుండా సోదరభావంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తున్న తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు కేటీఆర్ ట్విట్టిర్ టీమ్ అందుబాటులో ఉంటున్నది. ఆపద, అవసరం అన్నవారికి గంటల వ్యవధిలోనే సాయం అందజేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే వందలాది మంది అవసరాలు తీర్చిన కేటీఆర్, ఇప్పుడు ఇతర రాష్ర్టాల వారికీ అండగా నిలుస్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది.
ఇతర రాష్ర్టాలవారు కేటీఆర్‌కు చేసిన ట్వీట్లు
మా బంధువు ఒకరికి అంపోటెరిసిన్ బీ ఇంజెక్షన్ కావాలి. గుజరాత్లో ఎక్కడా దొరకడం లేదు. ఒక జీవితాన్ని సేవ్చేసేందుకు మీరు ఈ ఇంజెక్షన్ అందజేయగలరా? డాక్టర్లు ఈ కింది ఇంజెక్షన్లు రాశారు.
కేటీఆర్ అన్న.. సాయం కావాలి. మా పొరుగింటి ఆవిడ క్రిటికల్ కండిషన్లో ఉన్నది. టోసిలిజుమాబ్ 400 ఎంజీ ఇంజెక్షన్ కావాలి. నేను తమిళనాడులోని చిదంబరం నుంచి ట్వీట్ చేస్తున్నా.
కేటీఆర్ సర్. మా ఫ్రెండ్ నాన్న నిన్నరాత్రి టిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతదేహాన్ని వారి సొంతూరు రాజమండ్రిలోనే దహనసంస్కారాలు చేయాలనేది ఆయన చివరి కోరిక. మృతదేహాన్ని రాజమండ్రికి తీసుకెళ్లేందుకు మా ఫ్రెండ్ ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేదు. ఆయన చివరి కోరికను నెరవేర్చడానికి సహకరించండి.
మా నాన్న క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. మీరు మాకు సాయం చేయగలరా ప్రియమైన కేటీఆర్. నేను నిన్ను వేడుకుంటున్నారు. మా నాన్న ఏపీలో ఉన్నారు. నేను జేఎన్టీయూలో చదివిన గ్రాడ్యుయేట్‌ను. నా జీవితంలో సగం హైదరాబాద్‌లోనే గడిపా. సోదరభావంతో మాకు సాయంచేయండి.
కేటీఆర్ సర్.. మా పెద్దనాన్న, పెద్దమ్మకు పాజిటివ్ వచ్చింది. అమ్మకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరం ఉన్నది. చాలారకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. నేను గల్ఫ్‌లో ఉన్నాను, దయచేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అరేంజ్ చేయండి. మా బ్రదర్‌ను ఫోన్ నంబరులో సంప్రదించండి.
కేటీఆర్ సర్. మా తాతయ్య మహారాష్ట్రలో చనిపోయారు. అక్కడికి వెళ్లేందుకు ఈపాస్ అప్రూవల్ రావడం లేదు. ప్రస్తుతం మా కుటుంబం మొత్తం హైదరాబాద్‌లో ఉంది. మహారాష్ట్రకు వెళ్లేందుకు మీ సాయం కావాలి సర్.
రాష్ట్రంలో వందలమందికి సాయం
రాష్ట్రంలోనూ వందలమంది ట్వీట్లకు మంత్రి కేటీఆర్ స్పందించారు. సాయం పొందినవారు కేటీఆర్ టీమ్‌కు రీట్వీట్ చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. ‘మా నాన్న తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆరురోజులుగా ఆక్సిజన్ సపోర్ట్‌తో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉంటే ఇంటికి తీసుకెళ్లవచ్చని డాక్టర్లు చెప్పారు. కాన్సన్ట్రేటర్ పొందడానికి మీ సాయం కావాలి సర్. ఏడాది కిందటే గుండె ఆపరేషన్ అయింది. ఆక్సిజన్ రేట్ 89కి పడిపోయింది. దయచేసి సాధ్యమైనంత త్వరగా స్పందించండి’ అంటూ శ్రావణ్ మోర్తాటి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన గంటలోనే ‘కాన్సన్ట్రేటర్ వచ్చింది. మీరు చేసిన సాయానికి చాలా కృతజ్ఞులం సర్. గొప్పపాలన, జవాబుదారీతనానికి ఇది నిదర్శనం. మీరు నాయకుడిగా ఉన్నందుకు మీము చాలా సంతోషిస్తున్నాం.’ అంటూ శ్రావణ్ రీట్వీట్ చేశారు. దీంతో మీ నాన్నగారు త్వరగా కోలుకోవాలి అంటూ మంత్రి కేటీఆర్ ఆకాక్షించారు. ఇలా వచ్చిన ప్రతి ట్వీట్‌కు స్పందిస్తూ కేటీఆర్ అందరికీ ఆపద్బంధువుగా మారారు.