శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 00:47:00

ఉత్తుత్తి ప్యాకేజీ!

ఉత్తుత్తి ప్యాకేజీ!

 • ఉద్దీపన ప్యాకేజీ లెక్కలు బూటకం
 • జీడీపీలో 10 శాతం కాదు.. 1.5 శాతమే
 • కేంద్రం ఇచ్చే నిధులు 3 లక్షల కోట్లే 
 • మిగతాదంతా బ్యాంకులిచ్చే రుణాలే
 • ఎఫ్‌ఆర్‌బీఎం పెంపుతో సంస్కరణలకు లింకా?
 • రాష్ర్టాలకు నగదు రూపంలో సాయంచేయాలి
 • రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు  వినోద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ అంతా బూటకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. వాస్తవంగా ఈ ప్యాకేజీలో కేంద్రం ఇస్తున్నది రూ.3,20,902 కోట్లు మాత్రమేనని, మిగిలినదంతా రిజర్వ్‌ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నాబార్డు ద్వారా సమకూర్చే రుణపథకాలే ఉన్నాయని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ జీడీపీలో 10శాతం అంటూ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఈ నెల 13వ తేదీనుంచి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. జీడీపీలో ఉద్దీపన ప్యాకేజీ విలువ 10 శాతం అని చెప్తున్నప్పటికీ నిజమైన వ్యయం కేవలం 1.5 శాతం మాత్రమే అవుతుందని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన వివరించారు.  

కేంద్ర ప్యాకేజీపై వినోద్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు ఇవీ..

 • ఐదు రోజుల్లో కేంద్రం రూ.20,97,053 కోట్ల విలువైన ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలకు రూ.9,94,903 కోట్లు ఆర్‌బీఐ ద్రవ్యాన్ని సమకూరుస్తుందని చెప్తున్నారు. రుణ ఆధారిత పథకాలు, కొత్త పథకాల విలువ రూ.9,74,548 కోట్లు అంటున్నారు. రూ.3,20,902 కోట్లు మాత్రమే ప్రభుత్వానికి నిజమైన ఖర్చు అని ప్రకటించారు. ఇది కేంద్రం ప్రకటించిన మొత్తం ప్యాకేజీలో 15 శాతం మాత్రమే. మిగిలిన 85 శాతం ప్యాకేజీని ఆర్బీఐ, వాణిజ్య బ్యాంకులు, నాబార్డు భరించబోతున్నాయి.
 • కేంద్రం ఇస్తున్న ఉద్దీపన అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇచ్చినదానికంటే కూడా చాలా తక్కువ.
 • కేంద్రం ప్రకటించిన 50 రకాల చర్యలను, ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే ప్యాకేజీ పేరుతో ప్రజలను మోసగించినట్టు అర్థమవుతూనే ఉంది.
 • ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని 5శాతానికి పెంచాలంటే ఆర్థిక సంస్కరణలు అమలుచేయాలన్న షరతు విధించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ర్టాలకు కేంద్రం నగదు రూపంలో సహాయం చేయాలి. 
 • ప్రస్తుత విపత్తు నేపథ్యంలో రాష్ట్రాలు సంస్కరణలు అమలుచేయడం చాలా కష్టం. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే కరోనా కేసులు భారీగా పెరుగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాలు వ్యాధి నియంత్రణపై దృష్టి పెడుతూనే ఆర్థిక వ్యవస్థ సాఫీగా నడిచేలా చూడాలి. ఇలాంటి సమయంలో సంస్కరణలు ఎలా సాధ్యం? 
 • కేంద్రం ప్రకటించినవన్నీ రుణ ప్యాకేజీలే. ప్రైవేటీకరణ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, డీ రెగ్యులేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చేపట్టాల్సిన సంస్కరణలు. ఇవన్నీ దీర్ఘకాలికంలో ప్రభావం చూపుతాయి. 
 • పార్లమెంటులో చర్చ జరుపకుండానే ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్‌ రంగ ప్రాముఖ్యం పెంచారు. 
 • మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పుటికే నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వలస కార్మికుల  ఉపాధి కల్పన కోసమంటూ రూ.40 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? నరేగా ద్వారా ఉపాధి కల్పిస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ప్రయోజనం అందకనే ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. కొత్తగా కేటాయించిన నిధులతో ఉపాధి ఎలా కల్పిస్తారో స్పష్టత లేదు.
 • విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో తీసుకొనే చర్యలు లాక్‌డౌన్‌ అనంతర సవాళ్లను ఎదుర్కొనేలా ఉండాలి. పరిశ్రమల విషయంలో తీసుకున్న నిర్ణయాలు తగినవిధంగా లేవు. సులభతర వాణిజ్యం కొనసాగుతున్న ప్రక్రియ. ప్రస్తుత విధానాలపై నిరంతర పరిశీలన చేస్తూ ముందుకు వెళ్లాలి. 


logo