ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 19:15:26

ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా సేవలందించాలి : వినోద్‌కుమార్‌

ప్రభుత్వ అధికారులు నిస్వార్థంగా సేవలందించాలి : వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌ : ప్రభుత్వ అధికారులు ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరులకేంద్రంలో నిర్వహించిన గ్రూప్-2 ఉద్యోగుల వృత్తినైపుణ్య శిక్షణ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి అధికారి ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రూప్-2 ఉద్యోగం అందరికీ దక్కని అదృష్టమని, నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందన్నారు. క్రమశిక్షణతో సేవలందిస్తే తక్కువ సమయంలో ఐఏఎస్‌ క్యాడర్‌కు ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రూప్ -2 ఉద్యోగాలకు ఎంపికైన 470 మందికి శిక్షణ ఇప్పించడంలో సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య కృషి ఎనలేనిదని అన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హర్‌ప్రీత్‌ సింగ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌రెడ్డి,  శిక్షణా తరగతుల కోఆర్డినేటర్లు నబీ, రాంగోపాల్, సౌమ్యరాణి, సుబ్బారావు పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo