బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 02:09:54

ప్రభుత్వ ఆఫీసులు కళకళ

ప్రభుత్వ ఆఫీసులు కళకళ

  • గ్రీన్‌, ఆరెంజ్‌జోన్లలో వందశాతం ఉద్యోగుల హాజరు
  • మాస్కులతో భౌతికదూరం పాటిస్తూ కార్యకలాపాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో పాక్షికంగా పనిచేసిన ప్రభుత్వ కార్యాలయాలు తాజాగా పూర్తిస్థాయిలో సేవ లు ప్రారంభించాయి. కేంద్రం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడున జీవో 64 విడుదలచేసింది. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో, రెడ్‌జోన్లలో 33 శాతం సిబ్బంది హాజరు కావాలని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో పూర్తిస్థాయిలో హాజరై విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌లో వైద్య ఆరోగ్యసిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌, పారిశుద్ధ్య, రెవెన్యూ, గ్రామపంచాయతీ, విద్యుత్‌ విభాగాల అధికారులు, సిబ్బంది సెలవులు లేకుండా పనిచేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయ, మర్కెటింగ్‌, పౌరసరఫరాలశాఖల సిబ్బంది గ్రామాలకే వెళ్లి పంటలను కొంటున్నారు. లాక్‌డౌన్‌ విధించిన దాదాపు 50 రోజుల తర్వాత కేం ద్రం గ్రీన్‌, ఆరెంజ్‌జోన్లలో అన్ని కార్యక్రమా లకు అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల జిల్లాల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఆర్టీఏ కార్యాలయాలు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. రెడ్‌జోన్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలున్నా యి. కొన్ని రోజులుగా సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో కొత్త కేసులు నమోదు కావడంలేదు. ఈ రెండు జిల్లాలను రెడ్‌జోన్‌ నుం చి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే ఐసీడీఎస్‌) కార్యాలయంలో ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించారు. అందరూ మాస్కులు ధరించి విధులకు హాజరయ్యారు. ఐసీడీఎస్‌ అధికారిణి సమీక్ష కూడా నిర్వహించారు. వరంగల్‌ జెడ్పీ కార్యాలయంలోనూ భౌతికదూరం పాటిస్తూ పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తించారు. కరీంనగర్‌ జిల్లాలోనూ ఉద్యోగులు విధులకు హాజరై పని చేస్తున్నారు.

పూర్తిస్థాయిలో హాజరు

రాష్ట్ర ప్రభుత్వ గు రువారం రాత్రి విడుదలచేసిన జీవో 64 ప్రకారం గ్రీన్‌, ఆరెంజ్‌జోన్లలోని కార్యాలయాలకు ఉద్యోగులు శుక్రవారం నుం చి పూర్తిస్థాయిలో హాజరవుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లేక ఉద్యోగులు అనుకున్న మేర రాలేకపోతున్నారు. జిల్లాల్లో ఉద్యోగులు సొంత ట్రాన్స్‌పోర్ట్‌తోనే విధులకు హాజరవుతున్నారు. 


- రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడుlogo