సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:33

ఆలయ భూఆక్రమణను ఉపేక్షించం

ఆలయ భూఆక్రమణను ఉపేక్షించం

  • ఆక్రమణదారులను ఉపేక్షించం
  • లీజ్‌, అద్దె అంశంపై పునఃసమీక్ష
  • మంత్రులు అల్లోల, తలసాని

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆలయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతామని, ఆక్రమణదారులను ఉపేక్షించబోమని అటవీ, పర్యాటక, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. దేవాదాయ భూముల పరిరక్షణపై, నిరుపయోగ భూములను గుర్తించి, వాటిద్వారా ఆదాయం పొందే మార్గాలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. జంటనగరాల పరిధిలోని దేవాలయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన అధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని మాట్లాడుతూ.. దేవాదాయశాఖ ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. షాపులను నామమాత్రపు ధరకు లీజుకు తీసుకొని అధిక అద్దెకు సబ్‌లీజ్‌కు ఇస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దశాబ్దాల కిందటి లీజ్‌, అద్దెలను పునఃసమీక్షించాలని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూముల వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌ పరిధిలో రూ.55 కోట్లతో 13 ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న దేవాలయ భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్సులు, కల్యాణ మండపాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్టు దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్‌ ద్వారా 1,121 ఎకరాల ఆలయ భూములను గుర్తించి వెనక్కు తీసుకున్నామని చెప్పారు. 21 వేలఎకరాల ఆలయ భూములకు రక్షణ సరిహద్దు బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో దేవాదాయశాఖ విజిలెన్స్‌ జాయింట్‌ సెక్రటరీ శేఖర్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాసరావు, రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

నవరాత్రోత్సవం నిరాడంబరం!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలను జనసమూహం లేకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. 


logo