ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 02:16:32

పరిశుభ్రతకు ప్రాధాన్యం

పరిశుభ్రతకు ప్రాధాన్యం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నది. వైరస్‌ విస్తరించకుండా పారిశుద్ధ్య చర్యలుచేపట్టాలని  మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రోరైలు, ఆర్టీసీలో బుధవారం పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.  కరోనా విషయంలో భయాందోళనలు కలిగించే విధంగా ప్రచారం జరుగుతున్నా మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని సంస్థ చైర్మన్‌ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఇక బస్సులను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో  కడుగుతున్నామని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు చెప్పారు.  హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీబస్‌స్టేషన్లలోని కుర్చీలు, బెంచీలు, ఫ్లోర్‌ ను ప్రత్యేక రసాయనాలతో శుభ్రం చేశారు. రవాణాశాఖ కార్యాలయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల ని, అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది మాస్క్‌ లు ధరించి, అప్రమత్తంగా ఉండాలని రవాణా కమిషనర్‌ ఎంఆర్‌రావు సూచించారు. 


వారికి ప్రత్యేక గదుల్లో ఇంటర్‌ పరీక్ష

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించాలని సీఎస్‌ విద్యాశాఖకు సూచించారు. వైరస్‌ సోకకుండా ముందస్తు జాగ్రత్తలను తెలియచేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో కొవిడ్‌-19కు చెందిన ఐఈసీ పరికరాలు ప్రదర్శించాలని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ఇంటర్‌పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పరీక్షాకేంద్రాలను రోజూ పరిశుభ్రంగా ఉంచాలని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఆదేశించారు. దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారిని ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయించాలని సూచించారు.


మహేంద్రాహిల్స్‌లో స్కూళ్లకు సెలవు

రాష్ట్రంలో నమోదైన కరోనా బాధితుడి నివాసంఉన్న మహేంద్రాహిల్స్‌ ప్రాంతంలోని పలు ప్రైవేటు పాఠశాలలు మూడ్రోజులు సెలవు ప్రకటించాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్‌లో రక్షణ చర్యలు చేపట్టారు. హాస్టల్‌లోని 180 మంది విద్యార్థులకు మాస్క్‌లు అందించి, పరసరాలను శుభ్రంచేశారు. వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డును పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం సందర్శించారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో ఓ వ్యక్తికి జరిపిన కరోనా పరీక్షలో నెగటివ్‌ అని తేలింది. 


కోలుకుంటున్న కరోనా బాధితుడు

బన్సీలాల్‌పేట్‌: గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ బాధితుడు కోలుకుంటున్నాడని వైద్యాధికారులు తెలిపారు. ఆ రోగికి యాంటిబయాటిక్స్‌ ఇస్తున్నామని, జ్వరం, జలుబు తగ్గిందని, శ్వాస సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. వైరస్‌ అనుమానంతో బుధవారం 24 మంది దవాఖానకు వచ్చారని, వారికి వైద్యపరీక్షలు చేశామని కరోనా విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు గాంధీలో 144 మంది అనుమానితులకు చేసిన వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిందని, అందరూ వెళ్లిపోయారని చెప్పారు. కాగా మరో ఆరుగురు ప్రత్యేకవార్డులో వైరస్‌ నిర్ధారణ ఫలితాలకోసం నిరీక్షిస్తున్నారని తెలిపారు.


logo