బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 27, 2020 , 01:48:10

మలి సమరం

మలి సమరం

-మూడోదశను ఎదుర్కొనేందుకు సర్కారు సన్నద్ధం

-అన్ని విభాగాలూ సమాయత్తం

-కరోనా చికిత్సకు ప్రత్యేకంగా గాంధీ, కింగ్‌కోఠి వైద్యశాలలు

-విదేశాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పక్కా ట్రాకింగ్‌

-వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

-సీఎం కేసీఆర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ

-హైదరాబాద్‌పై దృష్టి సారించిన మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా కట్టడి కావడంలేదు. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 88 కేసులు నమోదయ్యాయి. ఆరు మరణాలు చోటుచేసుకొన్నాయి. తెలంగాణలో మరోనాలుగు కేసులు పాజిటివ్‌గా తేలాయి. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సైతం అన్ని రకాల చర్యలు తీసుకొన్నప్పటికీ దీని విస్తృతి ఆగటంలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా పక్కా కార్యాచరణతో వైరస్‌పై ముప్పేట సమరానికి సిద్ధమైంది. రెండుదశలు దాటి రాగలిగిన కరోనా రక్కసిని.. మలిదశలోకి అడుగుపెట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో అడ్డుకోవడానికి అన్ని విభాగాలతో అన్ని వైపులనుంచి యుద్ధానికి సిద్ధమైంది. కనిపించకుండా ప్రజలపై మాయాయుద్ధం చేస్తున్న సూక్ష్మ జీవిని నిర్మూలించేందుకు అన్ని విభాగాలను ఏకకాలంలో సమాయత్తంచేసి ఉద్యమస్ఫూర్తితో ముందుకుపోతున్నది. వైరస్‌ నిర్మూలనకు యుద్ధంచేస్తూనే.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అభాగ్యులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నది. 

కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థుల 

సంఖ్య పెరిగితే చికిత్సచేయడం కోసం హైదరాబాద్‌ గాంధీ దవాఖానను పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్‌గా మార్చడానికి ఏర్పాట్లు చేసింది. కింగ్‌కోఠి వైద్యశాలను కూడా పూర్తిస్థాయిలో కరోనాకు వైద్యం చేసేలా మార్చడానికి ఆదేశా లు జారీఅయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలెవ్వరినీ బయటకు రానివ్వకుండా లాక్‌డౌన్‌ అమలుచేస్తూనే.. ప్రత్యేకబృందాల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను పక్కాగా ట్రాక్‌చేస్తున్నారు. వారు రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగా రు? ఎవరెవరిని కలిశారు? ఏం చేశారు?.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూ అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కరోనా మూ డోదశకు చేరకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకొంటున్నారు. ఉదాహరణకు ఇటీవల విదేశాలనుంచి వచ్చిన 49ఏండ్ల వ్యక్తి మార్చి 14న హైదరాబాద్‌ నుంచి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్లాడు. మార్చి 17న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి 18న సికింద్రాబాద్‌ చేరుకొన్నాడు. కొడుకుతో కలిసి ఆటో లో ఇంటికెళ్లాడు. అప్పటికే అతనికి జలుబు, జ్వరం రావడంతో కుత్బుల్లాపూర్‌లో ఓ డాక్టర్‌ను సంప్రదిస్తే అజిత్రోమైసిన్‌, డోలో 650 మాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా తగ్గకపోవడంతో స్వయంగా గాంధీ హాస్పిటల్‌లో రిపోర్ట్‌చేశాడు. అక్కడ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది.  విదేశాలనుంచి వచ్చిన ప్రతి వ్యక్తిని ఇదేవిధంగా ట్రాక్‌చేస్తున్నారు. మరోవైపు విదేశాలనుంచి వచ్చినవారు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం, ఒకవేళ తెలియజేయకపోతే కేసులు పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు సమాచారం. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బంది సెలవులను పూర్తిగా రద్దుచేశారు. వారికి కావాల్సిన  కరోనా కిట్లు, వెంటిలేటర్లు, వైద్య పరీక్షలకు సంబంధించిన అన్ని పరికరాలను నిధులకు వెనుకాడకుండా అం దుబాటులో ఉంచారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి అనుమానితులకు  తరలిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్యు లు, వైద్య నిపుణులతోనే గడుపుతూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో కరోనా మూడో దశలోకి అడుగుపెట్టకుండా కచ్చితమైన, నిర్బంధమైన చర్యలు తీసుకొంటున్నారు. 

అభాగ్యులకు ఆపన్నహస్తం

ఒకవైపు కరోనా నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకొంటూనే.. దానికి సమాంతరం గా దారిద్య్రరేఖకు దిగువన.. రెక్కాడితే కానీ, డొక్కాడని ప్రజల రోజువారీ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పక్కా గా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రేషన్‌కార్డులు ఉన్నవాళ్లందరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు 12 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇవ్వడానికి సకల ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇందుకోసం 25 మంది అధికారులతో ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేశారు. మూడు షిఫ్టుల్లో ఈ బృందం పనిచేస్తూ.. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తూ.. లబ్ధిదారులకు రేషన్‌ సరఫరా సక్రమంగా జరిగేలా అన్ని చర్యలను కట్టుదిట్టంగా చేపడుతున్నారు. రేషన్‌ కార్డు దారులకు 1500 నగదును నేరుగా ఖాతాల్లోకి బదిలీచేయడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి. అటు కూరగాయల ధరలనూ నియంత్రించే చర్యలు తీసుకొన్నారు. హైదరాబాద్‌ నగరంతోపాటు జిల్లాల్లో కూరగాయల కొరత రాకుం డా, వారాంతపు సంతలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతించారు. అరవైకి పైగా మొబైల్‌ వాహనాలతో కూరగాయల రవాణా, అమ్మకాలను చేపట్టడం ద్వారా ఇండ్లకే పరిమితమైన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సీఎం ప్రత్యక్ష పర్యవేక్షణ  

రాష్ట్రంలో కరోనా బయట పడినప్పటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కక్షణంకూడా వృథా పోనివ్వలేదు. కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రముఖలతో నిరంత రం సంప్రదింపులు జరుపుతూ యంత్రాంగాన్ని పోరాటానికి సమాయత్తపరిచారు. వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పోలీసు, పౌరసరఫరాలు, పురపాలక, పంచాయతీరాజ్‌ తదితర శాఖలను సమన్వయపరుస్తూ, ఎ ప్పటికప్పుడు సమీక్షిస్తూ పకడ్బందీ కార్యాచరణకు పూనుకొన్నారు. మంత్రులతోపాటు ప్రజాప్రతినిధులందరినీ కార్యక్షేత్రంలోకి పంపించి అన్నిజిల్లాల్లో  ఎక్కడికక్కడ వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకొంటున్నారు. మంత్రి నుంచి గ్రామంలో వార్డు సభ్యుడిదాకా దాదాపు పదివేలమంది ప్రజాసైన్యమై కొవిడ్‌-19పై యుద్ధంచేస్తున్నది.  మరోవైపు  మంత్రి కేటీఆర్‌ ప్రధానంగా పరిశ్రమవర్గాలవారిని ఈ పోరాటంలో భాగస్వామ్యం అయ్యేలా కృషిచేశారు. కరోనా కట్టడికి సంబంధించిన మందులు, పరికరాల తయారీపై ఫార్మా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. రాష్ర్టానికి కావాల్సిన సోడియం హైపోక్లోరేట్‌, శానిటైజర్లు, బ్లీచింగ్‌పౌడర్‌ సహా అవసరమైన మందులు అందించాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశమున్న రాజధాని హైదరాబాద్‌లో గల్లీగల్లీ ల్లో తిరుగుతూ.. ప్రజలతో మాట్లాడుతూ.. వారికి అవగాహన కల్పిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులను నైట్‌ షెల్టర్లకు తరలించి ఆదుకొనే చర్యలు చేపట్టారు. స్వ యంగా నైట్‌షెల్టర్‌ సందర్శించి సరైన ఏర్పాట్లు ఉండేలా అధికారులను ఆదేశించారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికులకూ తానున్నానంటూ భరోసా ఇచ్చారు.  సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా కూడా వేలమంది ప్రజలు చెప్పుకొంటున్న సమస్యలకు ఓపికగా స్పందిస్తూ.. పరిష్కారాన్ని సూచిస్తూ.. అవసరమైన సహాయా న్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. అనూహ్యంగా సంభవించిన ఈ విపత్కర సమయంలో ఆపదలో ఉన్నవారికి సాంత్వన చేకూరుస్తున్నారు.  


logo
>>>>>>