సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 17:15:04

అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం...

అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధం...

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తే కూలీ చేసుకుని బతికే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారిని ఆదుకునేందుకు అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఎవరూ పనికి పిలిచే అవకాశం లేదంటే వారికి రేషన్‌ ఇతర సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అప్రమత్తతో ఉందన్నారు. పోలీస్‌, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకుని 15రోజులకు, లేదా నెల రోజులకు అవసరమైన సరుకులు పంపిణీ చేసే అవసరం వస్తే ఎలా పంపిణీ చేయాలనేదానిపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. 

వందకు వందశాతం మన బిడ్డలను ఆదుకుంటామని తెలిపారు.  ఇప్పటి వరకైతే దేవుడు దయవల్ల అటువంటి పరిస్థితి రాలేదని పేర్కొన్నారు. జబ్బు పడితే కూడా ఒక్క నయాపైసా ప్రజలు ఖర్చు పెట్టకుండా అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. కేసీఆర్‌ బతికి ఉన్నంత వరకు పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విలేకరుల దృష్టికి ఏమైనా వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుందని పేర్కొన్నారు. రేపు జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇంటి యజమానులు పనిమనుషుల కోసం చూడకుండా ఎవరి పని వారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 


logo