ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:20

కట్టింది లక్షన్నర.. వచ్చింది ఏడున్నర లక్షలు

కట్టింది లక్షన్నర.. వచ్చింది ఏడున్నర లక్షలు

  • పోలీస్‌ కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వ బీమా
  • 21 నుంచి 53 ఏండ్ల మధ్యనున్న ఉద్యోగులు అర్హులు
  • ప్రభుత్వ జీవిత బీమా సంచాలకుడు వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టీఎస్‌జీఎల్‌ఐ పథకం వరం లాంటిదని, ప్రభుత్వ జీవితబీమా పాలసీ తీసుకున్న ఉద్యోగి కుటుంబానికి పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వ బీమా సంచాలకుడు ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మహబూబూబ్‌నగర్‌ జిల్లా పోలీసుశాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రజనిక అనారోగ్యంతో మరణించారు. నామిని అయి న రజనిక భర్త తోట కుమార్‌నీలకు ఆయన రూ. 7,59,273  చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజనిక చెల్లించిన మొత్తం ప్రీమియం కేవలం రూ. 1,49,400 అని, దీనికి సరిపడా పాలసీ బాండ్లు తీసుకున్నారని తెలిపారు. దీంతో ఆమె కుటుంబానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వ బీమా బెనిఫిట్స్‌ అందాయని చెప్పారు.  ఏ ఇతర ఇన్సూరెన్స్‌ సంస్థలతో పోల్చుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించే ఈ పథకమే మెరుగైనదిగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వోద్యోగులు తమ మూలవేతనంలో 20 శాతం వరకూ ప్రీమియంగా చెల్లించి పాలసీలు పొంది ధీమాగా ఉండాలని సూచించారు. గతంలో పాలసీ బాండ్లున్నవారు సరైన పాలసీ నంబర్‌ను ఐఎఫ్‌ఎంఐఎస్‌ అనే పోర్టల్‌లో అపడేట్‌ చేసుకుంటే ప్రీమీయం జమ సురక్షితంగా వారి ఖాతాకు చేరుతుందని  ఆయన వివరించారు. 

53 ఏండ్లలోపువారు అర్హులు

టీఎస్‌జీఎల్‌ఐ పథకం కింద 21 నుంచి 53 ఏండ్ల వయస్సు మధ్య ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాలసీ బాండ్లు పొందేందుకు అర్హులని వెంకటేశ్వరరావు వివరించారు. జీతం నుంచి ప్రీమియం మినహాయించుకున్నంత మాత్రాన పాలసీ బాండ్‌ ఆటోమేటిక్‌గా రాదని, ప్రతీ ఉద్యోగి కచ్చితంగా తన ప్రతిపాదన పత్రాన్ని సదరు జిల్లా బీమా కార్యాలయాల్లో సమర్పించాలని చెప్పారు. పాలసీ బాండ్‌ ఒక అగ్రిమెంట్‌లాంటిదని, అగ్రిమెంట్లు లేకపోతే బోనస్‌, బీమా మొత్తాలు రావని, ఉద్యోగులు చెల్లించిన ప్రీమియం మాత్రమే తిరిగి చెల్లిస్తారని తద్వారా ఉద్యోగికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు వీ శ్రీనివాస్‌, ఉప సంచాలకులు నీతూబెన్‌, పీ జయచంద్ర, మార్గరెట్‌, బీ నరేందర్‌కుమార్‌, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.