శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:52

బోరుబండి దివాలా!

బోరుబండి దివాలా!

  • ఉమ్మడి కరీంనగర్‌లో ఏటా 70-90 కోట్లు ఆదా 
  • 20 ఎకరాల్లో 57 బోర్లు తవ్వకం
  • రూ.20 లక్షలు ఖర్చుచేసినా కనికరించని నీటిచుక్క
  • కాళేశ్వరం పుణ్యమాని ఉబికొచ్చిన భూగర్భజలం
  • పెర్కవేడులో పట్టువదలని విక్రమార్కుడి కథ

ఆరేండ్ల కిందటి మాట.. ఎండకాలం వస్తే చాలు ఊర్లల్ల ఎక్కడ చూసినా భూమికి తూట్లు పొడిచే శబ్దాలే.. గంటలకొద్దీ.. రాత్రంతా కొనసాగిన డ్రిల్లింగ్‌ పనులు.. వెయ్యి అడుగులు పోయినా చుక్కజాడలేని పరిస్థితి. కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని.. ఇక్కడ నీళ్లొస్తయి.. అక్కడ నీళ్లొస్తయి అంటూ వేసిన చోట వెయ్యకుండా బోర్లు వేసుడు.. ఆ బోర్లకు రిపేర్లు వస్తే.. రికాము లేకుండా మోటర్లను బాగుచేసే పనులు.. ఎవుసం చేసుడెందుకురా దేవుడా అని గోసపడుడు తప్ప దిక్కులేని దుస్థితి

  • కాళేశ్వరం నీళ్లతోనే రైతుల సాగు
  • గ్రామాల్లో కన్పించని బోరుబండ్లు.. పక్కరాష్ర్టాలకు పయనం 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏటా ఎండకాలం వచ్చిందంటేచాలు ఏ గ్రామంలో చూసినా బోర్‌వెల్స్‌ డ్రిల్లింగ్‌ చప్పుళ్లు విన్పించేవి.. ఇంచునీళ్లు పడ్డా చాలంటూ అన్నదాత అరిగోస కన్పించేది. కానీ, బోర్లకోసం అప్పులపాలై.. అత్మహత్యలుచేసుకున్న రైతన్న కన్నీటిగాథలకు కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకట్ట వేసింది. కాలువలు, చెరువులు, ప్రాజెక్టులతో ఉట్టిపడుతున్న జలకళ.. రైతన్నకు బోర్లతో పనే లేకుండాచేసింది. నిన్నటిదాకా రికాం లేకుండా మోగిన బోరువెల్‌ చప్పుళ్లను మూగబోయేలా చేసింది. గతంలో ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఏడాదికి ఏడువేల నుంచి తొమ్మిది వేల మధ్య వ్యవసాయబోర్ల తవ్వకం జరిగేది. ఒక్కో బోరుకు రూ.లక్ష చొప్పున వేసుకున్నా రైతులు రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టేవారు. ఇక్కడి రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్రోకర్ల తమిళనాడుతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి బోర్‌వెల్స్‌ తీసుకొచ్చి బోర్లు వేసేవారు. సీజన్‌తో సంబంధం లేకుండా.. సాగునీటి కోసం.. రైతులు చేయని ప్రయత్నమంటూ ఉండేదికాదు. రాష్ట్రంలోనే అత్యధిక బోర్లు వేసిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ ప్రసిద్ధికెక్కింది. వెయ్యి ఫీట్లు వేసినా చుక్కనీరు రాక అవస్థలు పడిన రైతులు వేలసంఖ్యలో ఉన్నారు. కానీ, నేడు కాళేశ్వరం పుణ్యమా అని ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలం ఉబికి వస్తున్నది. వాటర్‌హబ్‌గా మారిన శ్రీరాజరాజేశ్వర జలాశయం, కాళేశ్వరంతో 122 కిలోమీటర్ల పొడవున పునర్జీవం పొంది రిజర్వాయర్‌గా మారిన వదర కాలువ, ఆరు నెలలకుపైగా ఆరు వేల క్యూసెక్కులు పారిన కాకతీయ కాలువ, మత్తడి దుంకిన చెరువులు, కుంటలు, అన్నపూర్ణ జలాశయం ద్వారా మెట్ట ప్రాంతాలకు జలాల సరఫరా.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా కాళేశ్వరం జలాల సవ్వడే కనిపిస్తున్నది. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆరు మీటర్ల వరకు భూగర్భ జలాలు పైకి ఎగబాకాయి. 

ఒకే గ్రామంలో 500కు పైగా బోర్లు

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామం పక్కనే వరదకాలువ ఉన్నా చుక్కనీరు అందేది కాదు. దీంతో గ్రామంలో రైతులు బోర్లు వేయడం ప్రారంభించారు. 600 ఫీట్ల లోతువరకు బోర్లు తవ్వించేవారు. ఈ ఒక్క గ్రామంలోనే 500కు పైగా బోర్లు తవ్వారు. కానీ, శ్రీరాంసాగర్‌ పునర్జీవ పథకంతో ఇక్కడి రైతుల దశ తిరిగింది. బూరుగుపల్లి వద్ద వరదకాలువకు తూము ఏర్పాటుచేసి ఊరచెరువు నింపడంతో నీటి కష్టాలు దూరమయ్యాయి. 660 మంది రైతులు, 1,407 ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉండగా.. ప్రస్తుతం ఒక్క బోరు లేకుండానే అంతా సాగవుతున్నది.

కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఆరేండ్లు గడిసిపోయినయి. మొన్నటి ఎండకాలం కూడా వచ్చిపోయె. ఊర్లల్ల బోరు చప్పుడే ఇనిపించడం లేదు. బోరు మెకానిక్‌లకు పనే లేకుండా పోయింది. ఎండకాలంలో కూడా ఊరి చెరువులు మత్తడి దుంకవట్టినయి. నిరుటి వానకాలం నుంచి ఇప్పటిదాక చెరువుల్లో నీళ్లు ఎండిపోనేలేదు. కాల్వలు బ్రహ్మాండంగా పారుతున్నయి. ఇంతెందుకు భూమిలోంచి నీళ్లు ఉబికుబికి పైకి వస్తున్నయి. బోర్లకోసం లక్షలు లక్షలు మట్టిపాలుజేసిన రైతులు.. ఇప్పుడు పైసా ఖర్చులేకుండా నీళ్లు వాడుకొంటున్నారు. ఈ కరోనా కాలంలో మిగతా అన్ని ఉద్యోగాలకంటే ఎవుసమే మేలని సేద్యంవైపు మళ్లుతున్నరు.   కాళేశ్వరం నీళ్లతోనే రైతుల సాగు గ్రామాల్లో కన్పించని బోర్‌వెల్స్‌ బండ్లు పక్కరాష్ర్టాలకు పయనమైన వ్యాపారులు

ఇరవై మూడేండ్లు బోరుమన్నడు

రాయపర్తి: ఇరవై ఎకరాల భూమి ఉన్నది.. అమ్మానాయినలెంట సద్దులు పట్టుకపోయి నాగండ్లెంట దుక్కిల తిరిగిన సోయి ఉన్నది.. వయసుతోపాటు ఎవుసమంటే కాయిసు పెరిగిపోతే.. మోటపోసిన బావులు రానురాను నీళ్లులేక చిన్నబొందలుగా మారినయ్‌.. ఎవుసం మీద యావతో బోర్లు తవ్విస్తే భూగర్భజలం అంతకంతకూ పాతాళానికి పోతున్నదే తప్ప పైకి రాలె.. చేసేది లేక కుటుంబంతో పట్టణానికిపోయినప్పటికీ అక్కడ సంపాదించిందంతా ఊర్లో బోర్లు తవ్వేందుకే ఖర్చు చేసిండు. 23 ఏండ్లలో సుమారు రూ.20 లక్షలు ధారపోసి 57 బోర్లు వేయించిండు. కానీ, గంగమ్మ కనికరించలేదు. 

ఆశలు చిగురింపజేసిన కాళేశ్వరం

అపర భగీరథుడు కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్టువదలని విక్రమార్కుడిలో ఆశలు చిగురింపజేసింది. ఎత్తిపోతల పథకంతో జలాలు ఎదురెక్కించి గోదావరి నది జీవధారగా మారిందని.. నిండిన చెరువులతో భూగర్భజలం ఉబికొచ్చిందని ఆ నోటా ఆ నోటా విని మళ్లీ ఊరొచ్చిండు. ఐదు నెలల క్రితం బోరుబండి తీసుకెళ్లి తన పొలంలో ఐదు బోర్లు వేయించిండు.. 400 మీటర్లు తవ్వినా నీళ్లతడి కన్పించని చోట.. 100 మీటర్లలోనే గంగమ్మ పలుకరించింది. రెండుబోర్లలో పుష్కలంగా నీళ్లు వస్తున్నయి. ఇది వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం పెర్కవేడులో రైతు చిన్నాల హరిబాబు యాదవ్‌ విజయగాథ.పట్టణాన్ని వదలి కుటుంబంతో సహా గ్రామానికి వచ్చిన హరిబాబు తనకిష్టమైన ఎవుసం మొదలుపెట్టిండు. లక్షా20వేలతో ఎడ్లజత కొని.. మరో లక్షతో ఒక సహాయకుడిని పెట్టుకుని తనకున్న 20 ఎకరాలను సాగు చేస్తున్నడు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు ఐదెకరాల్లో వరి, పదెకరాల్లో పత్తి, మిగిలిన ఐదెకరాల్లో మిర్చి వేసిండు. 

కష్టమంతా బోర్లపాలైంది

మా కుటుంబానికి 12 ఎకరాల సాగు భూమి ఉన్నది. ఈ భూమికి సాగునీటికోసం ఏకంగా 16 బోర్లు వేసినం.. ఒక్కొక్కటి ఏడువందల ఫీట్ల వరకు తవ్వించినం. 14 బోర్లలో చుక్కనీరు రాలేదు. రెండుబోర్లలో కొన్నివచ్చినయి. రూ.పది లక్షలదాక ఖర్చుపెట్టిన. చూడచక్కని భూమి ఉన్నా.. నీళ్లులేక అల్లాడిపోయినం. ఇప్పుడు వరద కాలువకు నీళ్లు నింపడం వల్ల మా ఊరు చెరువు నిండింది. దీంతో.. నాకే కాదు మా ఊరికి కష్టాలు.. కన్నీళ్లు దూరమైనయ్‌. కేసీఆర్‌ దయవల్ల ఇక మాకు బోర్ల వైపు చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. 

- సాగి సత్యనారాయణరావు, రైతు, బూరుగుపల్లి

4 నెలలుగా  బోరుబండి  తీయలె.. 

పదిహేనేండ్లకుపైగా బోర్లు వేసే వ్యాపారంలో ఉన్న. సీజన్‌లో తినడానికి తీరికకూడా లేకుండా బోర్లు తవ్వేటోళ్లం. ఎక్కువ శాతం బోర్లలో చుక్కనీరు పడేది కాదు. ఆ క్షణంలో రైతుల మొహాల్లో చుక్కనెత్తురు ఉండేది కాదు. పదిహేను బుక్‌ చేసుకొని అడ్వాన్స్‌ ఇస్తేనే బోర్‌ వేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏడాదికాలంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో బోర్‌ వేసుకునే రైతుల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టవచ్చు. దీంతో మా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. నాకున్న రెండు బోర్‌బండ్లలో ఒక దానిని నాలుగు నెలలుగా ఇంటినుంచి బయటకు తీయడటం లేదు. 

- రాజునాయక్‌, బోర్‌వెల్‌ ఓనర్‌ logo