అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ముహూర్తం కూడా జరుపుకొని ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అనుకోకుండా కొన్ని సినిమాలు ఆదిలోనే ఆగిపోతాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా కూడా అదే జాబితాలో చేరిపోయింది. ముందు నుంచి అనుకున్నట్లు ఈ సినిమా ఇప్పుడు లేదు. మొన్నటి వరకు ఓకే అనుకున్న ప్రాజెక్టు ఉన్నపలంగా ఎందుకు ఆగిపోయింది అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. దానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా మరో కారణం కూడా తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం జరుగుతుంది. ఎంత వరకు ఇందులో నిజం ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ పేరు మాత్రం బాగానే వినిపిస్తుంది. అసలు ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? ఉంది.. బలమైన సంబంధమే ఉంది. అసలు విషయం ఏంటంటే ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు త్రివిక్రమ్. దాంతో యంగ్ టైగర్ సినిమాకు కథ సిద్ధం చేయలేదని తెలుస్తోంది. లైన్ సిద్ధంగానే ఉన్న బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కాలేదని.. అందుకే ఈ సినిమాకు జూనియర్ నో చెప్పినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, సాగర్ కే చంద్ర కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు త్రివిక్రమ్. గత కొన్ని నెలలుగా ఈ సినిమా పై ఫోకస్ చేసాడు మాటల మాంత్రికుడు. అంతకంతకు ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుండడంతో ఆయన పూర్తిగా తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో కొరటాల శివ మంచి కథ చెప్పడంతో ఆ సినిమా వదిలేసి ఇటు వైపు వచ్చాడు యంగ్ టైగర్. అలా మొత్తానికి తెలిసో తెలియకో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమయ్యాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు