సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 02:30:22

సర్కారు వైద్యం సూపర్‌

సర్కారు వైద్యం సూపర్‌
  • అన్ని అంశాల్లో గణనీయమైన పురోగతి
  • సర్జరీ, ఇన్‌, ఔట్‌ పేషంట్ల సేవల్లో 100శాతానికి పైగా ఫలితాలు
  • నవజాత శిశువుల సంరక్షణకు న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్లు
  • సామాజిక, ఆర్థిక సర్వే ప్రశంస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ, రాష్ర్టాల పరిధిలో వాస్తవ లెక్కలతో నిర్వహించే సామాజిక, ఆర్థిక సర్వే.. తెలంగాణ సర్కారు వైద్యరంగంలో చేపట్టిన  చర్యలను ప్రశంసించింది. ఐదేండ్లుగా సర్కారు దవాఖానలు అందిస్తున్న వైద్యసేవల్లో పురోగతి సాధించినట్టు పేర్కొన్నది. ప్రధానంగా మాతాశిశు సంరక్షణకు కల్పించిన వైద్యసౌకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలను అభినందించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) దవాఖానల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న సేవలు భేషుగ్గా ఉన్నాయని తెలిపింది. మందుల పంపిణీ, శస్త్రచికిత్సల నిర్వహణ, సోలార్‌ విద్యుత్‌ వంటి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడాన్ని మెచ్చుకున్నది. 


నిర్దేశించిన లక్ష్యానికి మించి సేవలు

‘2017-18 ఆర్థిక సంవత్సరంలో టీవీవీపీ దవాఖానల్లో 1,33,64,950 మంది ఔట్‌పేషంట్లకు సేవలు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. 1,61,07,491 మంది సేవలు అందించి 121 శాతం ఫలితాన్ని సాధించారు. 11,93, 400 మంది ఇన్‌పేషంట్లకుగాను.. 13,55,653 మంది సేవలు అందించి 114 శాతం ఫలితాన్ని సాధించారు. 66,960 మందికి సర్జరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని 1,08,962 మందితో 163 శాతం లక్ష్యాన్ని చేరారు. 2018-19లో 1,28,82,550 మంది ఔట్‌ పేషంట్లకు1,63,70,246 మందికి సేవలు అందించి 127 శాతం ఫలితాన్ని పొందారు. ఇన్‌పేషెంట్లు 11,30,280 మంది లక్ష్యంకాగా,  14,22,149 మందికి సేవలు అందించి 126 శాతం ఫలితం సాధించారు. 60,720 సర్జీలు లక్ష్యంగా పెట్టుకోగా  1,19,454 పూర్తిచేసి 197 శాతం లక్ష్యం సాధించారు’ అని సర్వే ప్రశంసించింది.


నవజాత శిశువుల కోసం 

మాతాశిశు సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను సోషియో ఎకనామిక్‌ సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. కేసీఆర్‌ కిట్ల పథకం అమలు ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరుగడం, మాతా, శిశు మరణాల రేటు తగ్గించడాన్ని అభినందించింది. పుట్టిన శిశువులకు అనారోగ్య సమస్యలుంటే వారిని సంరక్షించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుచేసిన స్పెషల్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్ల (ఎస్‌ఎన్‌సీయూ) అంశాన్ని ప్రస్తావించింది. ‘2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎన్‌సీయూలలో 31,310 మంది శిశువులను అడ్మిట్‌చేసుకొని 23,550 సేవలు అందించి డిశ్చార్జిచేశారు. 3,824 మంది శిశువులను ఇతర దవాఖానలకు రెఫరల్‌చేశారు. 2019-20లో సెప్టెంబర్‌ 15 వరకు 15,273    మంది శిశువులను అడ్మిట్‌చేసుకొని 11,803 సేవలు అందించి డిశ్చార్జిచేశారు. 1,848 మంది శిశువులను ఇతర దవాఖానలకు రెఫరల్‌చేశారు’ అని వెల్లడించింది. సర్కారు దవాఖానకు వచ్చే రోగులకు అందించే మందుల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినూత్నమని సర్వే ప్రశంసించింది. 


కంటివెలుగును కీర్తించిన సర్వే

అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన ‘కంటి వెలుగు’ అమలుతీరును సర్వే ప్రత్యేకంగా కీర్తించింది. ఈ పథకం కింద 1.54 కోట్ల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని, 22.93 లక్షల మంది రీడింగ్‌ అద్దాలు పొందారని, 18.14 లక్షల మంది ప్రత్యేక కంటి అద్దాలు తీసుకున్నారని తెలిపింది. 9.30 లక్షల మందిని కంటి ఆపరేషన్లకు ప్రతిపాదించినట్టు పేర్కొన్నది.


logo