బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:49

అన్ని అనుమతులూ తీసుకున్నాం

అన్ని అనుమతులూ తీసుకున్నాం

  • రాజకీయ ఆసక్తితోనే సెక్రటేరియట్‌ కూల్చివేతపై పిటిషన్లు 
  • కౌంటర్‌లో హైకోర్టుకు వివరించిన ప్రభుత్వం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సచివాలయ పాత భవనాలను కూల్చివేతకు అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల ప్రకారమే వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నామని హైకోర్టులో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేశారు. పిటిషనర్లు ఇద్ద్దరూ రాజకీయ పార్టీల నాయకులని, రాజకీయ ఆసక్తితోనే పిటిషన్లు దాఖలుచేశారని పేర్కొన్నారు. పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్లు.. పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్లుగా మారకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా సీఎస్‌ గుర్తుచేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తమ పాలన కోసమే ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించిందని, ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాలను అడ్డుకునేందుకు రాజకీయస్వార్థంతో పిటిషన్‌ దాఖలుచేశారని పేర్కొన్నారు. భవనాల కూల్చివేత నిర్ణయం వల్ల ఏ చట్టాల ఉల్లంఘన జరిగింది. ఎవరి ప్రయోజనాలు దెబ్బతిన్నాయనేది పేర్కొనలేదని వెల్లడించారు. ఆధారరహితంగా దాఖలైన ఆ పిటిషన్లను కొట్టివేయాలని సీఎస్‌ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.  

మంత్రివర్గ తీర్మాన ప్రతిని అందజేయండి

సచివాలయ పాత భవనాలను కూల్చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన ప్రతి సీల్డ్‌కవరలో అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ భవనాలను పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ పాత భవనాలను తొలిగించి నూతన సమీకృత సచివాలయ భవనం నిర్మించాలని గత నెల 30న మంత్రి మండలి తుది నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. 

భవనాలు కూల్చియాలని గతనెల 18న క్యాబినెట్‌ మధ్యంతర నిర్ణయం తీసుకున్నదని, ఆ నిర్ణయం ఆధారంగానే కూల్చివేతను తాత్కాలింగా ఆపేయాలని తాము మధ్యంతర ఉత్తర్వులు జారీచేశామని ధర్మాసనం పేర్కొన్నది. కూల్చివేతలకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న తుది తీర్మానంపై తమకు తెలియజేయాలని హైకోర్టు తెలుపగా.. క్యాబినెట్‌ తీర్మానం రహస్య పత్రమని సీల్డ్‌ కవర్‌లో మంగళవారమే అందజేస్తామని ధర్మాసనానికి విన్నవించారు. ఈ లోగా భవనాల కూల్చివేత కొనసాగించేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కూల్చివేతలు సగంలో నిలిచిపోయి భవనాలు చాలా ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. పిటిషన్‌ తరఫు న్యాయవాది వాదనలు విపిపిస్తూ ప్రభుత్వ వాదనలకు ప్రతివాదనలు సమర్పించేందుకు రెండు రోజుల సమ యం ఇవ్వాలని కోరారు. ఇరువర్గాల వాదనలు నమోదుచేసుకున్న ధర్మాసనం.. విచారణను 15వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కూల్చివేత నిలిపివేత ఉత్తర్వులను పొడిగించింది.


logo