మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 16:45:56

రామప్ప అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి ఎర్రబెల్లి

రామప్ప అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి ఎర్రబెల్లి

ములుగు : రామప్ప దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని ఆయన సందర్శించారు. దేవాలయంలో గల శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి ఎర్రబెల్లికి పూర్ణకుంభ స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలు అందించి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామప్ప అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఆదిత్య , ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.

రామప్ప అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. అట్లాగే అక్కడి నుంచే పంచాయతీరాజ్ ఈఈతో కూడా గ్రామానికి సంబంధించి సీసీ రోడ్ల నిర్మాణం, నిధులు తదితర అంశాలపై తగు ఆదేశాలిచ్చారు. పాలంపేట పంప్ హౌస్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.