శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 10:42:47

మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం: ఈట‌ల‌

మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం: ఈట‌ల‌

హైద‌రాబాద్‌: ‌ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మెరుగైన వైద్యం అందిచ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని దత్తాత్రేయ నగర్‌లో కొత్త‌గా ఏర్పాటుచేసిన‌ బ‌స్తీ ద‌వాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో క‌లిసి మంత్రి ప్రారంభించారు. బ‌స్తీ ద‌వాఖానాల్లో అన్ని ర‌కాల ప‌రీక్ష‌ల‌కు న‌మూనాలు సేక‌రిస్తార‌ని చెప్పారు. ద‌వాఖానాల్లో మందుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ద‌వాఖానాలు పేద‌ల‌కు అందుబాటులో ఉంటాయ‌ని, ఇవి నిత్యం తెరిచే ఉంటాయ‌ని చెప్పారు. బ‌తుకుదెరువు కోసం వచ్చిన వారికి, పేదలకు రెక్కాడితేగాని డొక్కాడ‌ద‌ని, ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. న‌గ‌రంలో మ‌రో 90 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

గ్రేటర్ హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే 199 బ‌స్తీ ద‌వాఖానాల్లో సేవ‌లందుతున్నాయి. వారం రోజుల్లో మ‌రో 30 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ప్ర‌భుత్వం ప్రారంభించనుంది. దీంతో న‌గ‌రంలో బ‌స్తీ ద‌వాఖానాల సంఖ్య‌ మొత్తం 223కు చేరుతుంది. వార్డుకు రెండు చొప్పున 300 ద‌వాఖానాలను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. వీటిని డ‌బ‌ల్ బెడ్‌రూం ఇండ్లు ఉన్న ప్రాంతాల్లో ఏర్ప‌టుచేయ‌నుంది. ఇందులో భాగంగా కాచిగూడ‌, పార్శీగుట్ట‌, కుత్బుల్లాపూర్‌, మ‌ల‌క్‌పేట్‌, క‌వాడిగూడ‌, దూల్‌పేట్‌, ఎర్ర‌గ‌డ్డ‌, నేరేడ్‌మెట్‌, మల్కాజిగిరి, సూరూర్‌న‌గ‌ర్‌, కార్వాన్‌లో వీటిని ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టింది.