శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 00:46:07

శిఖరాగ్ర సంక్షేమం

శిఖరాగ్ర సంక్షేమం

  • గుట్టలపైనున్న పెనుగోలుతో సర్కారీ బంధం
  • రైతుబంధు, పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
  • రోడ్డుమార్గం లేని పల్లెలోనూ ‘కరోనా’ సాయం
  • గూడెంవాసుల తరలింపునకు యత్నాలు

నాలుగు గుట్టల మధ్య పేర్చినట్టుగా ఉండే మూడు గుట్టలపై వెలిసిన బాసకోయగూడెం పెనుగోలు.. మూడు వాగులు దాటి 18 కిలోమీటర్లు నడకదారిలో వెళితే కానీ చేరుకోలేని ఆ గూడేనికి ప్రభుత్వ పథకాలు ఠంచన్‌గా చేరుతున్నయి. రైతుబంధు, ఆసరా పింఛన్లు సకాలంలో అందుతున్నయి. విద్యుత్‌ మార్గం వేయడానికి వీలులేకపోవడంతో ప్రభుత్వం సోలార్‌తో వెలుగులు నింపింది. రోడ్డు సౌకర్యం కూడా ఆ కోయగూడెంలో ప్రభుత్వం ఇచ్చిన కొవిడ్‌-19 సాయం కూడా అందింది. 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తూర్పున కలుగుకుంట గుట్టలు. పశ్చిమాన కుమ్మరికుంట గుట్టలు. ఉత్తరాన నడుంగుట్టలు. దక్షిణాన వంకుమామిడి గుట్టలు. వాటిమధ్య ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉండే మూడు గుట్టలపై వెలిసింది ఓ గూడెం. పేరు పెనుగోలు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ ఆవాస గ్రామం. దట్టమైన అడవిలోఉన్న ఈ గూడెం చేరాలంటే నాలుగు గుట్ట  లు ఎక్కిదిగి, మధ్యలో ఉన్న నల్లందేవీ, సాకిమడుగు, చిలుకముక్కు వాగులు దాటుకుంటూ 18 కిలోమీటర్లు కాలిబాట పట్టాల్సిందే. 22 కుటుంబాలకు చెం దిన 75 మంది (మహిళలు 41మంది. పురుషులు 34 మంది. 15 ఏండ్ల లోపు పిల్లలు 21) జీవనం సాగిస్తున్నారు. అలాంటి మూరుమూల గూడెంలోనూ అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అందరికీ రేషన్‌కార్డులు ఉన్నాయి. 

కొత్త పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు వచ్చాయి. రైతుబంధు సాయం జమ అవుతున్నది. ఆసరా పింఛన్లు క్రమం తప్పకుం డా వస్తున్నాయి. లాక్‌డౌన్‌లో మైదానప్రాంతాల్లోని ప్రజలకు అందించిన ప్రయోజనాలన్నీ పెనుగోలుకూ చేరాయి. గూడేనికి కరెంట్‌ సరఫరా చేయడం దాదాపు అసాధ్యం కావడంతో ప్రభు త్వం ఇంటింటికీ సోలార్‌ పలకలు అందజేసింది. అవే ప్రస్తుతం వెలుగును ఇస్తున్నాయి. కొండలు ఎక్కిదిగి పంటను అమ్ముకోవడం అ సాధ్యమని సారవంతమైన భూములున్నా వాటిని సాగుచేసుకోవడం లేదు. మక్కజొన్న, పెసళ్లు, శనిగలు, బొబ్బర్లు, మినుములు వంటి పండించుకుంటారు. ఇండ్లముందు అవసరమైన కూరగాయలు వేసుకుంటారు. ప్రభుత్వం ఇ చ్చే రేషన్‌బియ్యమే వండుకుతింటుంటారు. 


ఏది కావాలన్నా వాగుదాటాల్సిందే..

ఈ గూడెం వాసులు రేషన్‌ సరుకుల కోసం మూడుగుట్టలు దిగి, మూడు వాగులు దాటి గుమ్మడిదొడ్డికి రావాల్సిందే. గతంలో వానకాలంలో వాగుదాటుతూ అం దులోపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారానికో నెలకో దయతలిస్తే పారామెడికల్‌ స్టాఫ్‌వెళ్లి ముందులిచ్చి వస్తారు. అత్యవసర వైద్యం కావాల్సివస్తే కావడిమోస్తూ కిందకు తీసుకొస్తారు. కనీసం ఎడ్లబండి కూడా పోయేదారి లేకపోవడంతో పలు కుటుంబాలు కొండదిగి వచ్చి వాజేడులో స్థిరపడ్డాయి. అక్కడ పెనుగోలుకాలనీయే ఏర్పడింది. మిగిలిన కుటుంబాలు కొండలమీద ఉంటే వారి ఆలనాపాలనా కష్టమవుతున్నదని, అందుకే వాళ్లను కిందికి దిం పాలని భద్రాచలం ఐటీడీఏ పీవోలుగా పనిచేసిన గౌతమ్‌, నారాయణరెడ్డి (ప్రస్తుతం మహబూబాబాద్‌, నిజామాబాద్‌ కలెక్టర్లు) ప్రయత్నించారు. తమకు ఉపాధి కల్పిస్తే కిందకు దిగడటమే కాకుండా పెనుగోలులో ఉన్న భూములను సర్కార్‌కు ఇస్తామని, ఇక్కడున్న విస్తీర్ణంలో కాకపోయినా ఎవుసానికి చేసుకునేంత భూమి ఇస్తే సరిపోతుందనే ఆలోచనలో గూడెం ప్రజలు ఉన్నారు. 

చదువులో మెరుస్తున్న గూడెం బిడ్డలు

పెనుగోలు నుంచి కొద్దిమంది చదువు బాట పట్టారు. ఆ ఊరి నుంచి యువకుడు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందాడు. ఒంగోలు లో ఓ యువతి టీటీసీ చేస్తుండగా.. ములుగులో ఆశ్రమస్కూల్‌లో ఉంటూ మరోయువతి ఇంట ర్‌ చదువుతున్నది. ఏటూరునాగారం ఐటీడీఏలో కుట్టుశిక్షణ తీసుకొన్న యువతి గూడెంలోనే కుట్టుపనిచేస్తున్నది. కొండదిగివచ్చి చదువుకోవడం వల్లనే వారి భవిష్యత్‌కు భరోసా దొరికింది. మిగిలినవారు కూడా చదువుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ రెవెన్యూ భూమి 550ఎకరాలు ఉండగా.. 37మంది రైతుల పేరిట 155ఎకరాల పట్టాభూమి ఉన్నది. దీనికి రైతుబంధు సాయం పొందుతున్నారు. 

తొలి ఉద్యోగిని నేనే..

ఏడోతరగతిదాకా చదివి ఇక్క డ బడిలేక మానేశా. ఎలాగైనా చదువుకోవాలని ఓపెన్‌ టెన్త్‌, ఓపెన్‌ ఇంటర్‌ చేసిన. భద్రాచలం లో డిగ్రీ చదివి ఆరేండ్లు విద్యావలంటీర్‌గా పనిచేసిన. సూర్యాపేటలో బీపీఈడీ పూర్తిచేసిన. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, డీఎస్సీ రాసినా పోస్ట్‌ రాలేదు. తర్వాత పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. పెనుగోలు నుంచి నేనే సర్కార్‌ ఉద్యోగం సాధించా. 

-ఉయికె రమేశ్‌, పంచాయతీ కార్యదర్శి

కిందకు దిగి బతుకుతాం

ఇక్కడ బతుకలేమని కొంతమంది వెళ్లారు. వారికి పెనుగోలు కాలనీ పేరిట ఇండ్లు కట్టించారు. మేముకూడా ఇక్కడ భూములియ్యడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాన్నకు పింఛన్‌ డబ్బులు పడుతున్నయి. రేషన్‌ బియ్యం వస్తుంది. ఇన్నిచేస్తున్న సర్కార్‌ మాకు కచ్చితంగా కింద భూమికూడా ఇస్తదనే ఆశిస్తున్నం. ఆ మధ్య కలెక్టరాఫీసుకు కూడా పోయినం. అన్నీ ఇస్తామన్నారు. 

-ఉయికె సమ్మయ్య, పెనుగోలు వాసి

బియ్యం,పైసలు తెచ్చుకుంటున్న 

మొన్న దిగిన. బిడ్డ, అల్లుడితానకుపోయి ఒకదినం ఉన్న. కారటు మీద బియ్యం తెచ్చుకుంటున్న. పదిహేను వందల పైసలిచ్చిండ్లు. గూడెం పోతున్న. గబగబపోతే చీకటి పడ్తది. బిడ్డ నాతోని వత్తాంది. ఇద్దరం నడుసుకుంట పోతం (గుమ్మడిదొడ్డి నుంచి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఇచ్చిన ఉచిత బియ్యం. పదిహేను వందల రూపాయలు తీసుకొని పొనుగోలు బాటపట్టారు). 

-బొగ్గుల సమ్మక్క 


logo