సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 15:36:29

ప్రభుత్వం, అటవీశాఖ కల ఫలించింది : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

ప్రభుత్వం, అటవీశాఖ కల ఫలించింది : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

సిద్దిపేట : ప‌్ర‌భుత్వం, అట‌వీశాఖ క‌ల ఫ‌లించింద‌ని రాష్ర్ట డీజ‌పీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గ‌జ్వేల్ ప్రాంతంలో అట‌వీ పున‌రుద్ధ‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను అదేవిధంగా గజ్వేల్‌ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను డీజీపీ, ఐపీఎస్ అధికారుల బృందం బుధ‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. రాష్ట్రంలో అడవులను పునరుద్ధరించాలి. అటవీ పరిశోధన కేంద్రాలను స్థాపించాలి అన్న తెలంగాణ ప్రభుత్వం, అటవీశాఖ కల ఫలించాయని డీజీపీ అన్నారు. గజ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించే ముందు ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో సమావేశహాల్‌లో అడవుల పునరుద్ధరణ పనులను అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్.. డీజీపీ, పోలీస్ అధికారులకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్‌ను ఉపయోగించుకొని సహజ సిద్ధ‌మైన‌ పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. 

అడవి చుట్టూ కందకాలు తీసిన‌ట్లు చెప్పారు. దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని అన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. 30 రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందన్నారు. 


డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. కేరళ, మెట్టుపాలెం(తమిళనాడు), యాదాద్రి నమూనా స్ఫూర్తిగా చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులు మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. అటవీ విస్తీర్ణం , పచ్చదనం ప్రణాళిక బద్దంగా పెంచేందుకు అటవీ పరిశోధన సంస్థను ప్రభుత్వం స్థాపించిందన్నారు. అటవీ పరిశోధన స్థాపన వల్ల శాస్త్రీయంగా, వేగంగా అడవులను పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం, అటవీశాఖలు నిబద్ధతతో అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం అద్భుత సహకారం అందిస్తుందని కితాబునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరిత హరం కార్యక్రమం కేవలం అటవీశాఖది మాత్రమే కాదని అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునివ్వడం వల్ల అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు హరితహరం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చేసిందన్నారు. పోలీస్‌శాఖ కూడా హరిత హారంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. 

జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా చేపట్టామన్నారు. ఉపాధిహామీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం దగ్గర నుంచి రెండు సంవత్సరాలు మొక్కల సంరక్షణకు సైతం ఈ నిధులను ఉప యోగించుకున్న‌ట్లు తెలిపారు. మొక్కల సంరక్షణకు హరిత సైనికులను నియమించి అటవీశాఖ ద్వారా శిక్షణ ఇచ్చిన‌ట్లు చెప్పారు.  


ప్రతి గ్రామంలో కనీసం 2 వేల మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామన్నారు. ఓ వైపు అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలతో పాటు గ్రామాలలో పచ్చదనం పెంపు కార్యక్రమాలకు హరిత హరంలో భాగంగా ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అన్ని కార్యాలయాలు, సంస్థలలో హరితహరంను వ్యవస్థీకృతం చేశామన్నారు. జిల్లాలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ విజయవంతం అయ్యిందన్నారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిన‌ట్లు వెల్ల‌డించారు.