సోమవారం 01 మార్చి 2021
Telangana - Nov 27, 2020 , 01:45:50

దూసుకుపోతున్న తెలంగాణ

దూసుకుపోతున్న తెలంగాణ

  • డైనమిక్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌..
  • అభివృద్ధి సాధకుడికి అండగా నిలవాలి
  • విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌
  • మార్పును గమనిస్తున్న నగర ప్రజలు
  • వరదలను సమర్థంగా ఎదుర్కొన్న సర్కార్‌
  • మరో ప్రభుత్వం ఉండి ఉంటే చేతులెత్తేసేది
  • కేసీఆర్‌ పాలనలో సంబురపడుతున్న పల్లె
  • ఆయన వెంట ఉద్యమంలో నడవడం నా అదృష్టం
  • సాగునీటితో మారుతున్న పాలమూరు రూపురేఖలు
  • ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

చిన్న గల్లీలో గరీబోళ్ల పెద్ద కథను వినిపించిన గొంతు.. పల్లె కన్నీరుపెట్టిన కాలాన్ని తలచి విలపించిన కవి హృదయం.. అణువణువున తరిమల్లె సిరులు దొరలును.. అని కలగన్న గాయకుడు. బాపు బోసినవ్వులా.. బుద్ధుడి మోములా..బృందావనంలా ప్రతిఊరు మారాలని ఆకాంక్షించిన జానపదుడు. ఆయన మాట అచ్చమైన పల్లె పాట. జనం సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, సంబురాలను ప్రకృతిలో లీనమై వినిపించే అరుదైన వాగ్గేయకారుడు! 27 ఏండ్ల క్రితం పల్లె కన్నీటి కష్టాలను ప్రపంచానికి చాటారు. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా సొంతరాష్ట్రం ఏర్పడింది. వలస పాలన విముక్తి తర్వాత సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు కన్నీరు పెట్టుకున్న తీరును ప్రపంచానికి తెలిపిన కళాకారుడు గోరటికి ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్‌ సముచిత స్థానం కల్పించారు. పాలమూరు పల్లె కళాకారునికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో గోరటితో ‘నమస్తే తెలంగాణ’ ముచ్చట.. 

సమైక్య రాష్ట్రంలో పల్లె కన్నీరు పెడుతున్నది కనిపించని కుట్రల’.. అన్నారు ఇప్పుడు ఎలా ఉంది.?

పల్లె కన్నీరు పెట్టిన మాట వాస్తవమే. 27 ఏళ్ల కిందట ఆ పాట రాసినప్పుడు గ్రామీణ ప్రజలు పడిన కష్టాలు వర్ణించలేనివి. అప్పుడు ఉపాధి కోసం వలస వెళ్లే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సిద్ధించాక ఇప్పుడు వ్యవసాయ పనులు చేసేందుకు కూలీలు కూడా దొరకని విధంగా మార్పు వచ్చింది. నాలుగు రోజుల నుంచి కూలీలు దొరకక నా పొలంలో మక్కలు కోయలేదు. వ్యవసాయం ఎంత ముమ్మరంగా జరుగుతున్నదో పాలమూరులో చూస్తే అర్థమవుతుంది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీరు, రైతుబంధు రూపంలో పంట పెట్టుబడి, రైతుబీమా వంటి పథకాలతో ప్రస్తుతం అన్నదాత ఆనందంగా ఉన్నాడు. గ్రామాలు రైతు కేంద్రంగా జీవనం సాగిస్తయి. రైతు బాగుంటే పల్లె స్వరూపమే మారిపోతుంది. రైతులపై ఎంతో ప్రేమ ఉన్న కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో వ్యవసాయం స్వరూపమే మారిపోయింది. ఒకప్పుడు 3 రూపాయల మిత్తి కోసం తిరిగిన రైతన్న ఇప్పుడు రైతుబంధుతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఒకప్పుడు 3 గంటలే ఉండే కరెంట్‌ కోసం రాత్రిపూట కండ్లల్లో ఒత్తులు వేసుకుని నీళ్లు పారపెట్టుకున్న రైతు.. ఇప్పుడు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌తో సంతోషంగా పంటలు పండించుకుంటున్నడు. ఎద్దు ఏడుపు రైతు ఏడుపు ఉంటే లక్ష్మి ఉండదు.. అందుకే ఎద్దు, రైతు ఇద్దరు సంతోషంగా ఉండేలా కేసీఆర్‌ కృషిచేస్తున్నారు. ఎన్నో రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ రైతులకు చేస్తున్న అభివృద్ధిపై ఎన్నో వేదికలపై పొగడ్తల వర్షం కురిపించారు.. ఇది చాలదా కేసీఆర్‌ రైతు పక్షపాతి అని చెప్పేందుకు! రైతుల గుండెల్లో కొలువైన ముఖ్యమంత్రి ఒక కేసీఆర్‌ మాత్రమే.

తెలంగాణ గ్రామీణ వాతావరణం ఎలా ఉంది?

తెలంగాణ ప్రకటించిన రోజున రాములోరి సీతమ్మ పాట రూపంలో చెప్పిన. అణువణువున తరిమల్లె సిరులు దొరలును.. అని పాడిన. అన్నట్టుగానే రాష్ట్రం వచ్చిన తర్వాత వరి అధిక ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించింది. ఒకప్పుడు ఇతర రాష్ర్టాలపై ఆధారపడిన మనం ఇప్పుడు అనేక రాష్ర్టాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. ఇదంతా ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఫలాలే. పల్లె తనదైన అస్తిత్వాన్ని సంతరించుకుంటున్నది. ప్రగతి నిర్మాణదశలో కావాల్సిన మౌలిక వనరులన్నీ ఏర్పడుతున్నాయి. సాగు, తాగునీటి సమస్య లేదు. ఒకప్పుడు పుస్తెలతాడు కుదువపెట్టి వ్యవసాయం చేసిన రైతుకు నేడు ఆ పరిస్థితి పూర్తిగా తొలగిపోయింది. వ్యవసాయానికి పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే అందిస్తున్నది. ఉద్యమ ఆకాంక్షలన్నీ నెరవేరాయి. తెలంగాణ సమాజం బాధలు క్రమంగా తొలగిపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకానికైనా చిన్న పైరవీ కూడా అవసరం లేదు. అన్ని పథకాల డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పడుతున్నాయి. ప్రతి ఇంటికీ కేసీఆర్‌ అందించే ఏదో పథకం చేరుతున్నది. తెలంగాణ గ్రామీణ వాతావరణం బాగుపడుతున్నది. 

పాలమూరు కన్నీళ్లు నెరవేరినట్టేనా..?

పాలమూరు జిల్లాకు చెందిన వాడిగా ఆ కష్టాలు, కన్నీళ్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. చుక్కనీరు లేక మా పాలమూరు రైతన్న ఉపాధి కోసం ముంబై బాట పట్టిన రోజులు ఎలా మర్చిపోతా? కృష్ణా, తుంగభద్ర నదులు మా పాలమూరు మీదుగానే వెళ్తున్నా చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడమే కానీ సాగునీళ్లు దొరికేవి కాదు. వలస పాలనలో పాలమూరు ఎంత ఆగం అయ్యిందో నా పాట రూపంలో ఎన్నోసార్లు ప్రపంచానికి తెలియజేశా. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు ఎంతో కీలకపాత్ర వహించాయి. స్వరాష్ట్రం ఏర్పడినాక సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్‌ చేసిన కృషి మరువలేనిది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జిల్లాలో సాగునీరు అందించి వలస పోయిన రైతన్న తిరిగి వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌దే. కల్వకుర్తి ఎత్తిపోతలతో అద్భుతమైన మార్పు వచ్చింది. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. కోనసీమను మరిపించే రోజులు ముందున్నాయి.


రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రజలకు ఏం చెప్తారు.?

ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే మతకలహాలు, అల్లర్లు గుర్తొచ్చేవి. గూండాలు, దాదాలు, వీధికో రౌడీ అనే పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నగర ప్రజలకు పోలీసులు బాసటగా ఉంటున్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా మారుతున్నది. గతానికి ఇప్పటికీ నగరంలో వచ్చిన మార్పును ప్రజలు గమనిస్తున్నారు. పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌.. విదేశాల్లో సంపాదించిన అనుభవాన్ని హైదరాబాద్‌లో అమలుచేస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల తాకిడికి వేరే ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసేది. కానీ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పరిస్థితిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకొచ్చారు. వరద బాధితులందరికీ సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.10,000 సాయం అందించడం మామూలు విషయంకాదు. ఎప్పుడూలేని విధంగా జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచడం కేసీఆర్‌కే సాధ్యమైంది. ఒకప్పటి హైదరాబాద్‌ను ఇప్పటి హైదరాబాద్‌ను ప్రజలు పోల్చి చూడాలి. అభివృద్ధి సాధకుడు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలవాలి.

మార్క్స్‌నూ చదివిన కేసీఆర్‌

ఒక రాష్ట్రం సాధించిన తర్వాత కేవలం కొన్ని ఏండ్లలోనే తెలంగాణ అనేక విషయాల్లో అభివృద్ధి సాధించింది. నీళ్లు, సంక్షేమ పథకాలు, అధికారంలో పారదర్శకత ఇలా అనేక విషయాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారు. తత్వశాస్త్రం, రాజకీయం, సాహిత్యం, వాస్తు, ప్రణాళిక, అర్థశాస్త్రం.. ఇలా అనేక విషయాల్లో సీఎం కేసీఆర్‌ది అందెవేసిన చేయి. కేసీఆర్‌ మార్క్స్‌ను కూడా చదివారు.. అందుకే మాలాంటివాళ్లకూ ఆయన అంటే ఎంతో అభిమానం. ఆయన పిలిచి ఇచ్చిన పదవిని ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నా. ఎందరో తెలంగాణ ఉద్యమకారులను ఆయన గుర్తించారు. అందులో నేను ఒకడిని కావడం సంతోషకరం. 

ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు.? 

ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసే అవకాశం లభించింది. కేసీఆర్‌ సాహిత్య నేప థ్యం, కవులు కళాకారులపై ఆయనకున్న అభిమానం వల్లే నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని భావిస్తున్నా. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. గ్రామాల్లో గ్రంథాలయా లు, పాఠశాలల, సాహిత్య, సాంస్కృతిక రంగం అభివృద్ధికి అభివృద్ధికి నావంతు కృషి చేస్తా. మంచి కళాకారులకు ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు ప్రయత్నిస్తా. కళలు, సాహి త్యం ద్వారా చైతన్యవంతమైన సమాజం నిర్మించేందుకు కృషి చేయడమే కాకుండా ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా వారిలో అవగాహన కల్పించేందుకు కళాకారులతో కలిసి కృషి చేస్తా.

తెలంగాణ సాధిస్తున్న ప్రగతిపై మీరేమంటారు?

ప్రపంచంలోనే మహత్తరమైంది తెలంగాణ  ఉద్య మం. కేసీఆర్‌ రాజకీయ చతురత ఉద్యమకారులందరికీ తెలుసు. ఆయన వల్లే తెలంగాణ సాధ్యం అవుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌, కోదండరాం వంటి వాళ్లంతా గుర్తించారు. అందుకే అంతా ఆయన వెంట నడిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. చేతికి ఎముకలేని వ్యక్తి కేసీఆర్‌ అని చెప్పేందుకు ఆయన ప్రవేశపెడుతున్న పథకాలే నిదర్శనం. బాపు బోసినవ్వులా.. బుద్ధుడి మోములా.. బృందావనంలా ప్రతిఊరు మా రాలి.. అని నేను రాసిన పాట నిజం అవ్వడం కేవలం ఆయన వల్లే సాధ్యమవుతుందని ప్రముఖ నటుడు ఆర్‌ నారాయణమూర్తి నాతో అన్నారు. అన్నివర్గాలకు న్యాయం చేయగల వ్యక్తి ఆయన మాత్రమేనని, ఎంతోగొప్ప నాయకుడైన కేసీఆర్‌ ద్వారా పదవి పొందడం అదృష్టమని నాతో చెప్పారు.  

VIDEOS

logo