సోమవారం 13 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:13

చైనా యాప్స్‌ గాయబ్‌

చైనా యాప్స్‌ గాయబ్‌

  • చైనా యాప్‌లను తొలిగించిన గూగుల్‌ ప్లేస్టోర్‌
  • టిక్‌టాక్‌కు దీటుగా తెలంగాణ చట్‌పట్‌
  • దేశీ యాప్‌లకు భారీ డిమాండ్‌
  • చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం విచారణ
  • డాటా చౌర్యంపై దర్యాప్తునకు ప్యానెల్‌
  • ముఖ్యమైన సమాచారాన్ని నిల్వ చేసుకోండి
  • వినియోగదారులకు సాంకేతిక నిపుణుల సూచన

కయ్యాలమారి చైనాకు ముకుతాడు వేసేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్లేస్టోర్ల నుంచి చైనా యాప్‌లు మాయమవుతున్నాయి. నిషేధానికి గురైన 59 చైనా యాప్‌లను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలిగించగా, తాము కూడా అదేపనిలో ఉన్నామని యాపిల్‌ తెలిపింది. డాటా చౌర్యానికి పాల్పడిన చైనా యాప్‌లపై దర్యాప్తునకు కేంద్రం ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నది. చైనా యాప్‌లపై నిషేధంతో దేశీ యాప్‌లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. టిక్‌టాక్‌, హేలో, వీగో వంటి వీడియో యాప్‌ల స్థానంలో వినియోగదారులు రొపోసో, చింగారీ, ట్రెల్‌, చట్‌పట్‌ వంటి దేశీ యాప్‌లవైపు మళ్లారు. రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. చైనా ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు కూడా చెక్‌ పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 

కేంద్రప్రభుత్వం నిషేధించిన చైనా యాప్‌లను గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. టిక్‌టాక్‌ మాత్రం ప్లేస్టోర్‌ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. దాంతో ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడుతున్నవారు ఈ యాప్స్‌ను ఇక డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. యాపిల్‌ కంపెనీ కూడా తన యాప్‌ స్టోర్‌ నుంచి నిషేధిత యాప్‌లను తొలిగించే పని కొనసాగుతున్నదని కేంద్రప్రభుత్వానికి తెలిపింది. మరోవైపు ఈ యాప్స్‌కు సమీప భవిష్యత్తులో అనుమతిచ్చే ఆలోచన లేదని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రప్రభుత్వం నిషేధించిన చైనా యాప్‌ కంపెనీలపై విచారణకు కేంద్రం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనుంది. కేంద్ర సమాచార, హోం, శాస్త్ర సాంకేతిక, న్యాయశాఖలతోపాటు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సెర్న్‌-ఇన్‌) అధికారులతో ఈ ప్యానెల్‌ ఏర్పాటుకానుంది. నిషేధానికి గురైన యాప్‌లపై ఉన్న ఆరోపణలను ఈ ప్యానెల్‌ 48 గంటల్లో విచారించనుందని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ చైనా యాప్‌లు యూజర్ల అనుమతి లేకుండా వారి సమాచారాన్ని సేకరిస్తున్నాయని ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి.  

ఇప్పటికే వాడుతున్నవారికి కష్టమే

నిషేధిత యాప్స్‌ను కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం ఇప్పటికే వాడుతున్నవారిని కూడా నిరుత్సాహపర్చే చర్యలు చేపట్టింది. ఈ యాప్స్‌కు కొత్తగా అప్‌డేట్స్‌, ప్యాచెస్‌ రాకుండా అడ్డుకోనుంది. దాంతో యూజర్లకు యాప్స్‌ వాడటంలో ఇబ్బందులు ఎక్కువై వాటిని తమ ఫోన్లనుంచి తొలగించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ యాప్స్‌కు ఇంటర్నెట్‌ డాటా అందకుండా అడ్డుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను (ఐఎస్‌పీస్‌, టీఎస్‌పీస్‌) కేంద్ర సాంకేతిక సమాచారశాఖ కోరింది. గతంలో నిషేధించిన అశ్లీల యాప్స్‌కు కూడా ఇదే విధానాన్ని అమలుచేశారు. చైనాలో ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి యాప్‌ల వాడకాన్ని అడ్డుకొనేందుకు అక్కడి ప్రభుత్వం కూడా ఇదే విధానం అనుసరించింది.


48 గంటలు

ఇప్పటికే కొందరు వినియోగదారుల ఫోన్లలో ఉన్న యాప్‌లు ఓపెన్‌ కావడం లేదు. మరికొందరి ఫోన్లలో పనిచేస్తుండటంతో పూర్తిస్థాయి నిషేధం కాదు అనే అపోహ ఉన్నది. ఇది సరికాదని నిపుణులు చెప్తున్నారు. రెండోదశలో నిషేధిత యాప్‌లను బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (ఐఎస్‌పీ), టెలికాంరంగ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ నుంచి ఆదేశాలు వెలువడినట్టు సమాచారం. ఇది అమలైతే ఆయా యాప్‌లను ఓపెన్‌ చేస్తే స్క్రీన్‌పై ఎర్రర్‌ మెసేజ్‌ లేదా వార్నింగ్‌ మెసేజ్‌ వస్తుంది. దీంతో యాప్‌ ఉన్నా ప్రయోజనం ఉండదు. 

మూడోదశలో వినియోగదారుల ఫోన్లలో ఉన్న యాప్‌లను కూడా తొలిగించాలని కేంద్ర ప్రభుత్వం గూగుల్‌, ఆపిల్‌ను ఆదేశించొచ్చు. గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌, గూగుల్‌ ప్లే సర్వీసెస్‌ వంటివి వినియోగదారుల ప్రమేయం లేకుండానే వారి ఫోన్లలో నుంచి యాప్‌లను  ఆటోమెటిక్‌గా తొలిగిస్తాయి. 

సైబర్‌ నేరంగా పరిగణించొచ్చు 

ప్రస్తుతానికి కేంద్రం ఈ యాప్‌లపై నిషేధం మాత్రమే విధించింది. కేంద్రం నిషేధిత ఉత్తర్వుల్లో ‘యాప్‌ను వాడినా నేరం’అనే నిబంధనను చేర్చితే.. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం సైబర్‌ నేరంగా మారుతుంది. 

డాటాను డిలీట్‌ చేయండి 

టిక్‌టాక్‌, వీచాట్‌, కామ్‌ స్కానర్‌ వంటి యాప్‌లలో వినియోగదారులు తమ డాటాను ఫొటోలు, వీడియోలు, సందేశాల రూపంలో దాచిపెట్టుకున్నారు. ఈ డాటా మొత్తం చైనా సర్వర్లలో నిక్షిప్తమై ఉన్నది. ఈ సమాచారాన్ని డిలీట్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించలేదు. నిషేధం నేపథ్యంలో యాప్‌ పనిచేయకపోయినా, ఫోన్‌నుంచి మాయమైనా.. ఆ సమాచారం మొత్తం చైనాలోనే ఉండిపోతుంది. ఒకవేళ భవిష్యత్తులో కేంద్రం ఈ యాప్‌లపై నిషేధం ఎత్తివేసినా.. ఆ సంస్థలు డాటాను తిరిగి వినియోగదారులకు అందిస్తాయో లేదో తెలియదు. కాబట్టి వినియోగదారులు వీలైనంత త్వరగా అవసరమైన సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇతర డ్రైవ్‌లలో నిక్షిప్తం చేయాలని, మిగతా సమాచారాన్ని డిలీట్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

చైనా సంస్థలకు గట్టి దెబ్బే 

టిక్‌టాక్‌, హెలో వంటి చైనా యాప్‌లకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకుపైగా యాక్టివ్‌ యూజర్లు ఉంటే.. మన దేశంలోనే 10 కోట్లకుపైగా ఉన్నారు. మన దేశంలో 61.10 కోట్ల డౌన్‌లోడ్‌లు నమోదయ్యాయి. ఇది మొత్తం డౌన్‌లోడ్లలో మూడింట ఒకవంతు. ఆదాయంలోనూ భారత్‌దే ప్రధాన వాటా. ఇదొక్కటే కాదు.. మిగతా 58 యాప్‌లదీ ఇదే పరిస్థితి. తాజా నిషేధంతో ఈ సంస్థలకు గట్టి దెబ్బ పడనుంది. 

మనుగడ కష్టమే

వెబ్‌సైట్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. సర్వర్లను టెలికాం సంస్థలు బ్లాక్‌ చేయడం వల్ల యాప్‌ తెరుచుకోదు. హాట్‌స్పాట్‌ షీల్డ్‌ వంటి సాఫ్ల్‌వేర్‌ సాయంతో మనం వేరే దేశాల్లో ఉన్నట్టు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యంకాదు. కాబట్టి టిక్‌టాక్‌ వంటి యాప్‌లను చూసేవారు (వ్యూస్‌) తగ్గిపోతారు. చివరగా ఆయా యాప్‌లలోని కంటెంట్‌ పడిపోతుంది. యాప్‌లపై నిషేధం చైనాకు పెద్ద ఎదురుదెబ్బ కానున్నది.

- నల్లమోతు శ్రీధర్‌, సాంకేతిక నిపుణులు 


logo