బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Apr 12, 2020 , 01:20:14

బరిలోకి గూగుల్‌, యాపిల్‌!

బరిలోకి గూగుల్‌, యాపిల్‌!

  • కరోనాపై పోరుకు చేతులు కలిపిన దిగ్గజ కంపెనీలు
  • బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వాలకు సహకారం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారిని నిలువరించేందుకు టెక్‌ దిగ్గజ కంపెనీలు రంగంలోకి దిగాయి. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్‌, యాపిల్‌ సంస్థలు చేయిచేయి కలిపాయి. మహమ్మారిపై ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి బాధితులను గుర్తించడం (కాంటాక్ట్‌ ట్రేసింగ్‌) అత్యంత ముఖ్యం. ఈ నేపథ్యంలో బ్లూటూత్‌ సాంకేతికత ద్వారా బాధితులను గుర్తించేందుకు ఈ రెండు సంస్థలు ముందుకొచ్చాయి. ప్రజల గోప్యతకు, భద్రతకు ముప్పు వాటిల్లకుండా, వైరస్‌ వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వాలకు, ప్రజారోగ్య సంస్థలకు రెండు కంపెనీలూ సహకారం అందించనున్నాయి. ప్రపంచంలోని మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 99 శాతం ఈ రెండు కంపెనీల ఆపరేటింగ్‌ సిస్టమ్‌లపైనే నడుస్తున్నాయి. రెండు కంపెనీలు మొదట మే నెలలో అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ)ను విడుదల చేయనున్నాయి. తద్వారా యాప్‌లను ఆండ్రాయిడ్‌, ఐవోస్‌ డివైజ్‌లలో పరస్పరం ఆపరేట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. బ్లూటూత్‌ ఆధారంగా బాధితులను గుర్తించేందుకు రెండు సంస్థలు ఒక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనున్నాయి.