సీసీఎంబీ- విన్స్ యాంటీబాడీ థెరపీ

- గుర్రాలపై ప్రయోగాల్లో సత్ఫలితాలు
- ప్లాస్మా థెరపీ కంటే మెరుగైన పనితీరు
- సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడి
- మనుషులపై వాడకానికి డీసీజీఐకి లేఖ
కరోనా పోరులో ప్లాస్మా థెరపీ కన్నా మరింత మెరుగ్గా పనిచేసే సరికొత్త పద్ధతి వచ్చేస్తున్నది.సీసీఎంబీ- విన్స్ బయోప్రొడక్ట్స్ కంపెనీ యాంటీబాడీ థెరపీ ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయి. గుర్రాలపై ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. మనుషులపై వాడకానికి అనుమతి కోరుతూ సీసీఎంబీ.. డీసీజీఐకి లేఖ రాసింది.
ప్రత్యేక ప్రతినిధి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): కరోనా పోరులో కొత్త పద్ధతి వచ్చేస్తున్నది. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) యాంటీబాడీ థెరపీ ప్రయోగాలు విజయవంతంమయ్యాయి. కరోనా వైరస్‌కు ప్రతిరక్షకాలను వృద్ధిచేయడం కోసం సీసీఎంబీ, విన్స్ బయోప్రొడక్ట్స్ కంపెనీ లిమిటెడ్.. గుర్రాలపై జరుపుతున్న యాంటీబాడీ థెరపీ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. గుర్రాల రక్తం నమూనాల నుంచి సేకరించిన యాంటీబాడీలు బాగా పనిచేస్తున్నట్టు సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. యాంటీబాడీ థెరపీ ప్రయోగాలను మనుషులపై చేసేందుకు అనుమతివ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సీసీఎంబీ లేఖ రాసింది.
వారంలోగా అనుమతి
కరోనా యాంటీబాడీ థెరపీలో భాగంగా సీసీఎంబీ, శంషాబాద్‌లోని ప్రముఖ విన్స్ బయోప్రొడక్ట్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సహకారం అందించింది. ఇన్‌యాక్టివ్ కరోనా వైరస్‌ను గుర్రాల రక్తంలోకి పంపించి యాంటీ బాడీలు వృద్ధి జరిగేలా ప్రయోగాలు చేశారు. ఇందుకు దాదాపు 300 గుర్రాలను ఉపయోగించినట్టు సమాచారం. ఎలుకలు, కుందేళ్లపై కూడా ప్రయోగించినట్టు తెలిసింది. ప్రయోగానికి ఎంచుకున్న గుర్రాల రక్త నమూనాలను సేకరించి, పూర్తిగా శుద్ధిచేసి ఇతర గుర్రాలపై ప్రయోగించారు. దీనిద్వారా గుర్రాల శరీరంలో కరోనా ప్రతిరక్షకాలు ఏర్పడి మంచి ఫలితాన్నిచ్చాయని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. కరోనా యాక్టివ్ వైరస్‌ను అవి తట్టుకోగలిగాయని వివరించారు. మనుషులపై ప్రయోగానికి డీసీజీఐకి లేఖ రాశామని, వచ్చే వారంలోగా అనుమతి రావచ్చని ఆశాభావం వ్యక్తంచేశారు. యాంటీబాడీ థెరపీ.. ప్లాస్మా థెరపీ కంటే మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు.
వ్యాక్సిన్లపై అనుమానాలు అక్కర్లేదు
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం దేశంలో ఇస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లపై అ నుమానాలు అక్కర్లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టంచేశారు. ప్ర స్తుతం వ్యాక్సిన్ల ప్రయోగం వల్ల దుష్ప్రభావాలు కనిపించడంలేదని చెప్పారు. వేలమందికి వ్యాక్సిన్లు ఇస్తున్నా ప్రతికూల ప్రభావం లేకపోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఒకటి రెండు కేసుల్లో ప్రతికూల ప్రభావాలున్నట్టు వెల్లడవుతున్న ఘటనలపై దృష్టిసారించి.. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది లోతుగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్లు ఎంతకాలం పనిచేస్తాయనే విషయంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు మాస్క్ ధరించడం వంటి ముందుజాగ్రత్త చర్యలు పాటించడాన్ని పౌరులు విస్మరించొద్దని ఆయన సూచించారు.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు