శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 02:59:41

చెరువులు, నాలాలపై పక్కా ప్రణాళికలు

చెరువులు, నాలాలపై పక్కా ప్రణాళికలు

  • సాగునీటిశాఖ చీఫ్‌ ఇంజినీర్‌ సారథ్యంలో ప్రత్యేక విభాగం 
  • చెరువుల నిర్వహణతోపాటు ఆక్రమణల నిరోధానికి చర్యలు 
  • నీటి నిల్వల నియంత్రణకు ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో వ్యవస్థ
  • ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరంలోని చెరువులు, నాలాలాపై ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్టు రాష్ర్ట పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ సంవత్సరం కురిసిన భారీవర్షాల కారణంగా నగరంలోని పలు కాలనీలు నీట మునిగిన నేపథ్యంలో పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఇరిగేషన్‌, జలమండలి, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ తదితర శాఖలతో ఆదివారం మంత్రి విస్తృత సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరుగాలని అధికారులకు నిర్దేశించారు. చెరువుల నీటి మట్టాలతోపాటు వాటి వరద ప్రభావ పరిస్థితులు, చెరువు గట్టు (బండ్స్‌) బలోపేతం, వాటి బలాన్ని తెలుసుకునే విధంగా అధ్యయనం జరుగాలని సూచించారు. చెరువులు, నాలాలపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేయాలని కోరారు. నగరంలోని చెరువు కట్టల బలోపేతంతోపాటు ఆయా చెరువులకు అవసరమైన ఇతర నిర్మాణాలను చేపట్టాల్సిన అవసరం ఉందని సాగునీటిశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను వేగంగా ముందుకు  తీసుకెళ్లేందుకు ప్రత్యేక యూనిట్ల ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 

ఈ విభాగానికి సాగునీటి శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఒకరు నాయకత్వం వహిస్తారని, జీహెచ్‌ఎంసీ తరఫున ప్రత్యేక కమిషనర్‌ ఒకరు ఉంటారని వారి ఆధ్వర్యంలో వాటర్‌బాడీస్‌ సంరక్షణ, అభివృద్ధి, దాని పరిధిలో ఉన్న ఆక్రమణల తొలగింపు వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని వాటర్‌బాడీస్‌పైనా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో జలమండలి, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, సాగునీటి శాఖ సహా ఇతర భాగస్వామ్య శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. సాగునీటి శాఖ రిజర్వాయర్లలో వరద ప్రవాహాన్ని నియంత్రించిన విధంగానే ఎప్పటికప్పుడు కురిసే వర్షాలు, వాటి వల్ల వచ్చే వరదను అంచనా వేస్తూ ఆయా చెరువుల్లో నీటి నిల్వల నియంత్రణకు ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ కొత్త చట్టాన్ని తీసుకురానున్న నేపథ్యంలో వాటర్‌బాడీస్‌ సంరక్షణకు కఠిన నిబంధనలు, నియమాలను చేరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. చెరువుల్లో అక్రమంగా భవనాలు నిర్మించినా, ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని కూల్చివేసే అధికారం పురపాలక శాఖకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సాగునీటిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ సహా సాగునీటి, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరుగాలి. చెరువులు, నాలాలపై ప్రభుత్వం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం చేయాలి. 

- మంత్రి కేటీఆర్‌