శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 08, 2020 , 01:19:43

మనసున్న మారాజులు

మనసున్న మారాజులు

  • ఆపదలో తోటివారికి ఆసరా  
  • తమకున్న దాంట్లోనే వితరణ   
  • ఆదర్శంగా నిలుస్తున్న దాతలు

కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి చేతనయినంత సాయం చేస్తున్నారు.. తమకున్న దాంట్లోనే కొంత పక్కవారికి పెడుతున్నారు.. అనార్తుల ఆకలి తీరుస్తూనే.. బతుకుబండి లాగడానికి తోడ్పాటు ఇస్తున్నారు పలువురు దాతలు. అవసరం ఉన్నవారిని ఆదుకుంటూ మనసున్న మారాజులుగా నిలుస్తున్నారు. 

నమస్తేతెలంగాణనెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ కార ణంగా ఉపాధి లేక పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. పలువురు దాతలు అండగా నిలుస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని కమ్మపల్లికి చెందిన పలువురు తమకు ప్రభుత్వం పంపిణీచేసిన 3.5 క్వింటాళ్ల బియ్యాన్ని రేషన్‌కార్డులు లేని నిరుపేదలకు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన జంగ మధురమ్మ(60) తనకు వచ్చిన రేషన్‌ బియ్యం 12 కిలోలతోపాటు 3 కిలోల చింతపండును ఇద్దరు ఒడిశా కార్మికులకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నది. సర్కారు తనకు నెలనెలా రూ.2,016 పింఛన్‌ ఇస్తున్నదని, సీఎం కేసీఆర్‌ పిలుపుతో తనకొచ్చిన రేషన్‌ బియ్యంతోపాటు 3కిలోల చింతపండును కొనుగోలు చేసి కార్మికులకు అందజేసినట్టు మధురమ్మ తెలిపింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పోచారం ట్రస్ట్‌ అండగా నిలిచిం ది. ఈ మేరకు 116 మంది పారిశుద్ధ్య సిబ్బందికి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవా రం రూ.వెయ్యి చొప్పున అందజేశారు. కాగా, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు రెండు రోజుల్లో రేషన్‌కార్డు లేని నిరుపేదలకు 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నట్టు ట్రస్ట్‌ ప్రతినిధులు తెలిపారు. 

9 రోజులుగా 150 మందికి భోజనం..   

పూట గడవని 150 మంది నిరుపేదలకు నర్సింగ్‌ విద్యార్థి తన స్నేహితుల సాయం తో 9 రోజులుగా తిండి పెడుతూ ఆకలిని తీర్చుతున్నారు. కరీంనగర్‌ నర్సింగ్‌ స్కూల్‌లో జీఎన్‌ఎం ద్వితీయ సంవత్సరం విద్యార్థి కొత్తకొండ వెంకటసాయి తన స్నేహితులు సతీశ్‌, మాసం గణేశ్‌, విజయ్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, శివ, అశోక్‌ కలిసి భోజనం పెడుతున్నారు.  

సీఎం ఆదేశాలతో..

తల్లి మృతితో అనాథలైన గ్రేటర్‌ హైదరాబాద్‌ లోని సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన నలుగురు చిన్నారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర కు ముషీరాబాద్‌ తాసిల్దార్‌ జానకి నిత్యావసర సరుకులు అందజేశారు. అంతకుముందు వీఆర్వో పిల్లలను కలిసి వారి వివరాలను సేకరించారు. పిల్లలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇప్పించాలని, గురుకులంలో విద్యను అందించాలని స్థానికులు తాసిల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. 


logo