శనివారం 04 జూలై 2020
Telangana - Jan 31, 2020 , 08:28:55

ఆస్తిపన్నుపై తీపి కబురు..

ఆస్తిపన్నుపై తీపి కబురు..

హైదరాబాద్ : ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గం శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను గురువారం కలిశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో ఆస్తిపన్ను, భూముల రిజిస్ట్రేషన్‌ సమస్యలు, డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్ల ప్రారంభోత్సవం తదితర అంశాలపై మంత్రి చాంబర్‌లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, జోనల్‌ కమిషనర్‌ సిక్తా పట్నాయక్‌, చీఫ్‌ ఇంజినీర్‌ సురేశ్‌కుమార్‌లతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. ప్రధానంగా మంత్రి కేటీఆర్‌ ఆస్తిపన్ను సమస్యలపై ఫిబ్రవరిలో మంచి తీపి కబురు తెలియజేస్తామని హమీ ఇచ్చారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.

అలాగే ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్‌ సమస్యలపై కొన్ని న్యాయపరవమైన చిక్కులు, అవాంతరాలు ఉన్నాయని, అందుకోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని మంత్రి హమీ ఇచ్చారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల ప్రారంభోత్సవాన్ని ఫిబ్రవరి మాసంలో చేపట్టి అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారన్నారు. ఆటోనగర్‌ హరిణ వనస్థలి వద్ద నిర్మిస్తున్న అధునాతన బస్‌ టెర్మినల్‌, నియోజకవర్గంలో హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌లకు వేర్వేరుగా ఒకే ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న గ్రేవ్‌యార్డుల ఫొటోలను మంత్రికి చూపించగా సుధీర్‌రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, నాగోలు డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు చెరుకు ప్రశాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo