మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 29, 2020 , 19:07:41

మనిషిలో 'మంచి మనిషి'

మనిషిలో 'మంచి మనిషి'

పేరు సింహాచలం. ఊరు రాజమండ్రి. ఇప్పుడుంటున్నది హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ ఏరియా. ఎక్కడ జనం కనిపిస్తే అక్కడికి తోపుడు బండి తోసుకుంటూ వెళ్లి నిమ్మకాయ సోడాలు అమ్ముకుంటూ జీవనం సాగించడం ఆయన వృత్తి. ఇప్పుడీయన ప్రస్తావన ఎందుకు అంటే ..

వారం క్రితం ..

పోయిన బుధవారం

నా కార్లో ఉన్నాయని భావిస్తున్న భూమికి సంభందించిన ఐదు డాక్యుమెంట్లు గల ఒక సెట్ కనిపించకుండా పోయింది. కార్లో, మా ఇంట్లో, నా ఆఫీసులో జల్లెడ పట్టినా ఎక్కడా దొరకలేదు.

ఆ భూమి డాక్యుమెంట్లు నాకు ఇప్పుడు తప్పనిసరి.

ఎందుకంటే వాటిని వేరొకరికి అమ్మడానికి ఆరోజే (బుధవారం) సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకున్న. అడ్వాన్స్ లు కూడా తీసుకున్న. 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ అనుకున్నాం.

రిజిస్ట్రేషన్ కంటే ఒకరోజు ముందు డాక్యుమెంట్లు మాయమైపోయాయ్. ఎంత వెతికినా దొరకలేదు.

చేయని ప్రయత్నం లేదు.

పిచ్చి లేసింది.

సబ్ రిజిస్ట్రార్ ద్వారా ట్రూ కాపీలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా ట్రూ కాపీలతో రిజిస్ట్రేషన్ చేయుంచుకోడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపరు. అమ్మకందారు డాక్యుమెంట్లు కూడా ఒరిజినల్ కాపీలు ఉంటేనే ఆ ప్రపార్టీకి విలువ. మన నుంచి కొనుక్కున్న వ్యక్తి భవిష్యత్తులో మళ్లీ ఎవరికైనా అమ్ముకోవాలన్నా లింక్ డాక్యుమెంట్లు కూడా ఒరిజినల్ ఉండాలనే కోరుకుంటాడు. ఎప్పుడైనా బ్యాంకు లోనుకు వెళ్లినా వాళ్ళూ ఒరిజినల్స్ నే ఆక్సెప్ట్ చేస్తారు.

పోయిన డాక్యుమెంట్లను తిరిగి సబ్ రిజిస్ట్రార్ ద్వారా పొందాలంటే పెద్ద ప్రాసెస్. ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో మొదలై విచారణలు, వార్తా పత్రికల్లో ప్రకటనలు, కోర్టులు .. ఇలా పెద్ద తతంగం. నెలలు గడిస్తే తప్ప అస్సలు పని కాదు.

డాక్యుమెంట్లు పోగొట్టుకుని వారం రోజులుగా పిచ్చి లేపుకుంటున్న నేను ఈరోజు సాయంత్రం ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రాంతంలో రోడ్డుపై తిరిగీ తిరిగీ చివరికి ఈ కింది ఫోటోలోని వ్యక్తిని పట్టుకున్న.

"సరిగ్గా గుర్తు తెచ్చుకో. వారం క్రితం మధ్యాహ్నం పూట నీ దగ్గర నిమ్మ సోడా తాగా. ఆ రోజు నా చేతిలో డాక్యుమెంట్ల సెట్ ఏమైనా నీకు కనిపించిందా? అని అడిగా!

ఆయన ముఖంలో ఆశ్చర్యం

ఆ క్షణమే నవ్వు!

తోపుడు బండికి కింది భాగాన దాచిపెట్టిన కవర్ తీసి నా చేతిలో పెట్టాడు. అది నా కవరే.

ఆయనకు చదువు రాదు.

"సరిగ్గా చూసుకోండి .. మీ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయేమో" అన్నాడు. డాక్యుమెంట్లలో మీ ఫోన్ నెంబర్ ఉందేమో అని వేరేవాళ్ళతో వెతికించా. కానీ లేదని చెప్పారు. అందుకే ఫోన్ చేయలేకపోయా" అంటున్నాడు.

(నేనా భూమి కొన్న సమయంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఫోన్ నెంబర్ ఉండేదికాదు. ఆ సౌకర్యం ఇప్పుడొచ్చింది)

నా ప్రాణం లేచి వచ్చింది

కవర్ కూడా విప్పలేదు.

అతన్ని చూస్తూ ఆ ఎండలో అలాగే నిల్చుండి పోయా.

పాంట్ జేబులోంచి కొంత పెద్ద మొత్తమే తీసి ఆయనకు ఇవ్వబోయా. కానీ ఆయన అస్సలు తీసుకోలేదు.

ఇక లాభం లేదనుకున్న

అతన్ని పట్టుకుని ఒక సెల్ఫీ తీసుకున్న.

ఆయనా సంబురపడిపోయాడు.

నా బిజినెస్ కార్డు ఇచ్చి అవసరం ఉన్నప్పుడు నాకు కాల్ చెయ్యు అని చెప్పి వచ్చేసా!

మహా నగరంలో

మండుటెండలో

నట్టనడి రోడ్డుపై.. నేనీరోజు ఒక మామూలు మనిషిలో..

"మంచి మనిషిని" చూసా! 

గోదారంతటి మంచి మనస్సుని చూసా

సేకరణ : ఫేస్‌బుక్‌


logo