బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:40:49

వలస కార్మికులకు ఏర్పాట్లు భేష్‌

వలస కార్మికులకు ఏర్పాట్లు భేష్‌

  • మేడ్చల్‌లో సకల వసతులు కల్పించిన ప్రభుత్వం
  • హైకోర్టుకు అడ్వకేట్‌ కమిషన్‌ రిపోర్ట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలసకార్మికులకు వసతులు, రవాణా సదుపాయాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికారుల కృషి ప్రశంసనీయంగా ఉన్నదని హైకోర్టు నియమించిన అడ్వకేట్‌ కమిషన్‌ పేర్కొంది. మేడ్చల్‌ జాతీయ రహదారిపై వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తున్నారని, కొందరిని ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల వద్ద వదిలేస్తున్నదని ఆరోపిస్తూ రమా శంకర్‌నారాయణ్‌ మెల్కొటే హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నిజానిజాలు తేల్చేందుకు ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ సభ్యుడు కౌటూరు పవన్‌కుమార్‌ మంగళవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఉత్తరభారతంవైపు వెళ్లే వలసకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మేడ్చల్‌లోని దివాన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటుచేసిన  షెల్టర్‌హోంలో ఉన్న వలసకార్మికులకు అన్ని సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, వివిధ ఎన్జీవోల కార్యకర్తలు వలసకార్మికులకు ఆహా రం, వైద్యం, ఔషధాలు అందజేస్తున్నారని వివరించారు. ప్రభుత్వంతో కలిసి పలు స్వచ్ఛందసంస్థలు వలసకార్మికులకు చెప్పులు, బూట్లు అందజేశాయని తెలిపారు. మేడ్చల్‌కు వచ్చి న కార్మికులకు వేగంగా రవాణా ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. కార్మికులను శ్రామిక్‌ రైళ్లు, బస్సుల్లో తరలిస్తున్నట్టు వెల్లడించారు. షెల్టర్‌హోంలో తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నవారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారని, దీనిని స్వయంగా పరిశీలించామని పేర్కొన్నారు. స్థానిక జిల్లా అధికారులు వలసకార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారని, వారి సమస్యలపై మానవీయ కోణంలో స్పందిస్తున్నారని తాము గమనించామని నివేదికలో వెల్లడించారు. 

ఆశావర్కర్లు, ఎన్జీవోల సేవలు అద్భుతం.. 

షెల్టర్‌ హోంలో ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ సమన్వయం తో పనిచేస్తున్న ఎన్జీవోలు వలసకార్మికులకు అందిస్తున్న సేవ లు ప్రశంసనీయమని పవన్‌కుమార్‌ తెలిపారు. ఏడురోజుల నవజాత శిశువును తీసుకెళ్తున్న మహిళ పరిస్థితిని చూసి చలించిపోయిన ‘భూమిక’ ఎన్జీవో ప్రతినిధి సత్యవతి సదరు మహిళను  కారు ఏర్పాటుచేసి వారి స్వస్థలానికి పంపించారని రిపోర్ట్‌లో తెలిపారు. తాము వెళ్లిన దీవాన్‌ ఫంక్షన్‌హాల్‌లో దాదాపు 600 మంది ఉన్నారని, వారిలో గర్భిణులు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారని వివరించారు. వీరికోసం ప్రత్యేకంగా వలంటీర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

బృందాలుగా విభజించి... 

మేడ్చల్‌ రహదారిపై వెళ్తున్న కార్మికుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల కార్మికులు ఉన్నారని తెలిపారు. తాము ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉన్నప్పుడే జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ వెళ్లాల్సిన బృందాలను ప్రత్యేకంగా విభజించి కొంతమందిని బస్సుల్లో, మరికొంత మందిని రైళ్లలో పంపారని పేర్కొన్నారు. మొత్తంమీద  వలస కార్మికుల అంశంలో హైకోర్టు జోక్యంతో భవిష్యత్తులో ఎలాంటి విషాదకర ఘటనలు జరిగే అవకాశం లేదని పవన్‌కుమార్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. 


logo