గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 08, 2020 , 12:43:07

నేటికి చెక్కుచెదరని గోండురాజుల ఖిల్లా

నేటికి చెక్కుచెదరని గోండురాజుల ఖిల్లా

నాటి సిరిపురం పట్టణమే నేటి సిర్పూర్‌(టి)(కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా). 12వ శతాబ్ధం నుంచి 17వ శతాబ్ధం వరకు సిర్పూర్‌(టి) సిరిపురం పట్టణ కేంద్రంగా గోండు రాజులు పరిపాలన కొనసాగించారు. గోండు రాజుల పరిపాలనకు చిహ్నంగా సిర్పూర్‌(టి) మండలకేంద్రంలోని డౌనల్‌ ప్రాంతంలో నేటికి గోండు రాజుల ఖిల్లా ముఖద్వారం మాత్రం చెక్కు చెదురకుండా దర్శనమిస్తున్నది.  గోండు రాజుల పరిపాలన కాలంలో సిరి సంపదలు గల పట్టణంగా వెదజిల్లిన సిరిపురం పట్టణం నేడు ఎంతగానో వెనుకబడి ఉంది. క్రీ.శ.870 ప్రాంతము నుంచి గోండు నాయక వ్యవస్థ కొనసాగినది. తమ సంస్కృతి పరిరక్షణకు గోండులు యుద్ధ వీరులై అన్యప్రాంతీయులతో పోరాటాలు చేయాల్సి వచ్చింది. పెన్‌గంగ నదికి దక్షిణ ప్రాంతములో గోండు జాతీయులు అత్యధిక సంఖ్యలో ఉండేవారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, ఉట్నూర్‌, చెన్నూర్‌ ప్రాంతములు గోండు రాజ్య అంతర్భాగములుగా ఉండేవి. గోండు రాజులు బలిష్టమైన 22 దుర్గాలను కలిగి ఉండే. క్రీ.శ.1240 నుంచి 1750 వరకు గోండు రాజుల పాలన సాగింది. 

భీం  బల్లాల్‌సింగ్‌..

అసమాన బలసంపన్నుడు భీం బల్లాల్‌సింగ్‌ గోండు వీరుడు. కోల్‌బిల్‌ స్థాపించిన గోండు రాజ్యాన్ని విస్త్రృత పరచిన నిజమైన రాజ్యస్థాపకుడిగా పేరుపొందాడు. ఈయన ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ను తన రాజధానిగా చేసుకున్నాడు. గోండు యువకులను సైన్యములో చేర్చుకొని వారిని యుద్ధయోధులుగా తీర్చిదిద్దాడు.


రాంసింగ్‌..

దిన్‌కర్‌సింగ్‌ తనయుడు రాంసింగ్‌. గోండు రాజ్యపీఠమలంకరించిన తర్వాత, రాజ్యవిస్తరణకు పూనుకున్నాడు. గోండు రాజ్యమును అతి సమర్థవంతంగా పాలించిన దక్షుడు రాంసింగ్‌. సైనిక బలమును పెంచి, కొత్తగా అనేక కోటలు నిర్మించాడు. గోండు వీరులను ఆదరించి, ప్రోత్సహించి, వారికి అటవీ ప్రాంతాన్ని అప్పగించాడు. గోండు వీరులకు కోటలను అప్పగించి, వారిని తన సామంతులుగా పరిగణించి, తన సామంత వీరులని తార్వేకలని పిలిచారు. 

ఖండియా బల్లాల్‌షా..

సూర్జబల్లాల్‌ షా తనయుడైన ఖండియా బల్లాల్‌ షా తండ్రి మరణానంతరం గోండు సింహాసమును అధిష్టించాడు. సిర్పూర్‌ పట్టణం రాజధానిగా పాలిస్తున్న సమయంలో, అతని రాణి అనారోగ్యానికి గురైంది. రాజ వైద్యులు సిర్పూర్‌ వాతావరణానికి ఆమె శరీరతత్వానికి సరిపడదని తెలుపుట వల్ల పెన్‌గంగ నదికి ఆవలి తీరాన బల్లార్‌పూర్‌ పట్టణాన్ని నిర్మించి, భార్యతో కూడి అక్కడ ఉండసాగారు. బల్లార్‌పూర్‌ పట్టణమే నేటి బల్లార్షా. ఖండియాబల్లాల్‌షా చంద్రపూర్‌ పట్టణాన్ని నిర్మించి తన రాజాధానిని అక్కడికి మార్చి పాలించాడు. ఇతని పరిపాలన కాలము క్రీ.శ.1437 నుంచి 1462.ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, సిర్పూర్‌, తాండూర్‌వంటి దుర్గాలు గోండు రాజులకు సంబంధించినవి. మహారాష్ట్ర పీష్వాలు ఆదిలాబాద్‌ జిల్లాలో అనేక ప్రాంతములందు దేశ్‌ముఖ్‌, దేశ్‌పాండ్యలను నిలిపినారు. వీరు ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి చౌతు, సర్దశముఖి వంటి పన్నులు వసూలు చేసి పీష్వాల కందించేవారు. స్వతంత్రభావములు కలిగి స్వయం ప్రతిభతో రాజ్యస్థాపన మునర్చి సుమారు 511 సంవత్సరములు అనగా క్రీ.శ.1240 నుంచి 1751 వరకు పాలించిన గోండు ప్రభువులు చరిత్రలో సమున్నత స్థానమును పొందారు.


logo