శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 02:01:44

భాగ్యనగరంలో గోల్డ్‌మన్‌

భాగ్యనగరంలో గోల్డ్‌మన్‌

  • 500కు పైగా ఉద్యోగావకాశాలు
  • భవిష్యత్తులో మరింత విస్తృతం
  • 2021లో కార్యాలయం ప్రారంభం 
  • ప్రకటించిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ
  • మంత్రి కేటీఆర్‌ ప్రజెంటేషన్‌తో 
  • అందివచ్చిన మరో అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ దేశంలో తన రెండో కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ రాకతో ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు హైదరాబాద్‌ను తమ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకుంటున్నాయని మరోసారి నిరూపితమైంది. ఆ సంస్థ ప్రతినిధులు గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కే తారకరామారావుతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. మొదట్నుంచి ప్రపంచస్థాయి సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్న మంత్రి కేటీఆర్‌.. సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన చర్చల్లో సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో తమ రెండో కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా హైదరాబాద్‌ ఒక కొత్త, వినూత్నమైన కేంద్రంగా ఉంటుందని పేర్కొంది. దీనివల్ల తమ సంస్థ భౌగోళికంగా కేంద్రీకృతం కాకుండా.. స్థానిక ప్రతిభను ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా, సుదీర్ఘ్ఘకాలం నిలిచి ఉంటుందని పేర్కొంది.  

వచ్చే ఏడాది ప్రారంభం

హైదరాబాద్‌ కార్యాలయాన్ని 2021 రెండో అర్ధభాగంలో ప్రారంభిస్తామని గోల్డ్‌మన్‌శాక్స్‌ తెలిపింది. సుమారు 500 మంది ఉద్యోగులతో దీనిని ఏర్పాటుచేస్తామని, భవిష్యత్తులో సేవలను విస్తృతం చేస్తామని చెప్పింది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న కార్యాలయం బెంగళూరు శాఖతో పోటీపడుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నది. ఇక్కడి వ్యాపార భవన సదుపాయం, సంస్థ ఉద్యోగులకు అందుబాటులో ఉండే గృహాలు, విభిన్నమైన ప్రతిభ అందుబాటులో ఉండటం, నాణ్యమైన మౌలిక వసతులతోపాటు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నందునే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించినట్టు సంస్థ తెలిపింది. మంత్రి కేటీఆర్‌తోపాటు గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా చైర్మన్‌ సంజయ్‌ఛటర్జీ, ఎండీ, ఇండియా హెడ్‌, గుంజన్‌ సంతాని, ఎండీ, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రవికృష్ణన్‌, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఐటీఈ అండ్‌ సీ శాఖ సీఆర్వో  అమర్‌నాథ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.


ఫలించిన మంత్రి కేటీఆర్‌ కృషి..

కొవిడ్‌-19 తరువాత ఆర్థికరంగాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరిస్తున్న తీరు, రియల్‌ఎస్టేట్‌ రంగం స్థిరంగా పురోగమిస్తుండటం, సుస్థిరమైన ప్రభుత్వం కొనసాగుతుండటం.. తదితర అంశాలపై మంత్రి కేటీఆర్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ఉటంకించారు. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) సెక్టార్‌లో హైదరాబాద్‌ను ఒక హబ్‌గా మార్చడానికి చేస్తున్న కృషిని వివరించారు. గడిచిన ఐదేండ్లలో సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌, అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌, సింక్రొనీ ఫైనాన్సియల్‌ లాంటి ఆర్థికరంగ సంస్థలు తెలంగాణకు వచ్చాయి. వీటి రాక వెనుక మంత్రి కేటీఆర్‌ కృషి ఉన్నది. కొవిడ్‌-19 సమయంలో కేటీఆర్‌ అనేక సంస్థలు, కంపెనీలతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతో సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కేటీఆర్‌ ప్రజంటేషన్‌కు ఫిదా అయిన గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లోనే తమ రెండో కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనే నిర్ణయానికి వచ్చి.. ఆ వెంటనే ప్రకటించారు.  

గోల్డ్‌మన్‌ శాక్స్‌కు స్వాగతం: మంత్రి కేటీఆర్‌

ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో స్వాగతం పలుకడం ఎంతో సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమ సంస్థకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా చైర్మన్‌ సంజయ్‌ఛటర్జీకి, ఎండీ, ఇండియా హెడ్‌ గుంజన్‌సంతానికి, ఎండీ, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ రవికృష్ణన్‌ బృందానికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ నగరం భారీ కంపెనీలను ఆకర్షించడం కొనసాగిస్తూనే ఉన్నదని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ నగరం తన పట్టును కోల్పోలేదని, పోటీతత్వాన్ని ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌ రాకతో.. హైదరాబాద్‌కు ఇప్పటికే బలంగా ఉన్న ఆర్థిక సాంకేతిక సానుకూల వాతావరణం మరింత విస్తృతం అవుతుందన్నారు.

హైదరాబాద్‌ నగరం భారీ కంపెనీలను ఆకర్షిస్తూనే ఉన్నది. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ నగరం తన పట్టును కోల్పోలేదు. పోటీతత్వాన్ని ప్రదర్శించడం వల్లనే ఇది సాధ్యమైంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ రాకతో.. హైదరాబాద్‌కు ఇప్పటికే బలంగా ఉన్న ఆర్థిక, సాంకేతిక సానుకూల వాతావరణం మరింత విస్తృతం అవుతుంది. 

-ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌