గురువారం 09 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 19:41:30

తెలంగాణ భూముల్లో బంగారం పండుతున్నది!

తెలంగాణ భూముల్లో బంగారం పండుతున్నది!

సూర్యాపేట : తెలంగాణ భూముల్లో బంగారం పండుతున్నదని, ప్రపంచ దేశాలకు అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించే సామర్థ్యం ఇక్కడి భూములకుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని కేంద్ర జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రుణమేళాలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయంపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందించిన చేయూతతో రైతులు పండుగలా జరుపుకుంటున్నారన్నారు. నియంత్రిత వైపు రైతులను మళ్లించి, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని తెలిపారు. కృష్ణా, గోదావరి నీటిని మళ్లించి 40లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారనీ, రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారని చెప్పారు. రైతులు నియంత్రిత పంటల సాగుపై దృష్టి పెట్టాలని, డిమాండ్‌ ఉన్న పంటల సాగు చేస్తేనే రైతుకు గిట్టుబాటు ధర నిర్ణయించే శక్తి వస్తుందని, ఈ దిశగా రైతులు ఆలోచన చేయాలంటూ లెక్కలు వేసి, ఊదాహారణలతో రైతులకు వివరించారు. కార్యక్రమానికి టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టి జానయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, సూర్యపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.


logo