సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 02:17:01

నర్సాపూర్‌కు గోదావరి జలాలు: మంత్రి హరీశ్‌రావు

నర్సాపూర్‌కు గోదావరి జలాలు: మంత్రి హరీశ్‌రావు

నర్సాపూర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.25 కోట్లతో కోమటిబండ నుంచి నర్సాపూర్‌కు గోదావరి జలాలు తీసుకొస్తామని పరిష్కారిస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  ఆదివారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి,  మాజీ మంత్రి సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌తో పట్టణప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ ఆర్టీసీ కుంట, బస్‌డిపో, సంగారెడ్డి రూట్లో ఉన్న పంట కాల్వ, రాయారావు చెరువును సందర్శిం చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం వద్ద జరుగుతున్న పాత భవనాలతొలగింపు పనులను పరిశీలించారు. 


అనంతరం స్థానిక చిల్డ్రన్స్‌పార్కులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నర్సాపూర్‌ బస్‌డిపో పనులు 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పాత తాసిల్దార్‌ కార్యాలయం స్థలంలో రూ.5 కోట్లతో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌తోపాటు చేపల విక్రయ కేంద్రం, రైతు బజార్‌ను అత్యధునిక హంగులతో నిర్మిస్తామని అన్నారు. జూనియర్‌ కళాశాల పక్కన స్పోర్ట్‌కాంప్లెక్స్‌ నిర్మిస్తామని.. ఇందులో  మినీ స్టేడియంతో పాటు షటిల్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ కోర్టులతోపాటు ఇండోర్‌ బాడ్మింటన్‌  800 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌లను నిర్మించ నున్నట్లు చెప్పారు.  అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, మార్కెటింగ్‌  శాఖల అధికారులతో సమీక్షించారు. 


logo