ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 16:04:42

గోదావ‌రి నీటితో జీవ‌న‌దిగా మూసీ!

గోదావ‌రి నీటితో జీవ‌న‌దిగా మూసీ!

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ ఎన్నిక‌ల్లో భాగంగా పార్టీ మేనిఫెస్టోను విదుద‌ల చేస్తూ సీఎం కేసీఆర్‌ మూసీని గోదావ‌రి న‌దితో అనుసంధానించ‌నున్న‌ట్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇదేమీ ఎండ‌మావి కాదు.. క‌ల అంత‌క‌న్నా కాదు. ప్ర‌తిప‌క్షాల‌ను క‌దిలించిన ఈ ప్ర‌క‌ట‌నకు కాళేశ్వ‌రం ప్రాజెక్టు రీడిజైన్‌లోనే రూప‌క‌ల్ప‌న చేశారు సీఎం కేసీఆర్. గోదావరిని మూసీతో అనుసంధానించడం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ జిల్లాల్లో భూగర్భజల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.

గోదావ‌రి జ‌లాల‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా స‌ముద్రమ‌ట్టానికి 618 మీటర్ల ఎత్తులోని కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్‌కు త‌ర‌లిస్తున్న విష‌యం విధిత‌మే. 15 టీఎంఎసీల సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న ఈ కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ నుండి ప్ర‌తీరోజు 700 క్యూసెక్కుల నీరును 80 కిలోమీట‌ర్ల దూరంలో గ‌ల‌ న‌గ‌రంలోని జంట జ‌లాశ‌యాల‌కు(ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్‌) త‌ర‌లించ‌నున్నారు. 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాలువ ద్వారా కొండపోచమ్మ సాగర్ నీటిని హైదరాబాద్ జంట జలాశయాలకు తీసుకురానున్నారు.

మూసీతో గోదావ‌రితో అనుసంధానంపై కేఎల్ఐఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (హైదరాబాద్) హరిరామ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. 5,054 క్యూసెక్కుల నీటిని తీసుకువెళ్లేలా సంగారెడ్డి కాలువ రూపొందించబడిందన్నారు. దీనిలో 4,354 క్యూసెక్కులు నీటిపారుదల అవసరాలకు కాగా 700 క్యూసెక్కులు మొదట ముసీని శుభ్రపరిచేందుకు ఇదే క్ర‌మంలో న‌ల్ల‌గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టును గోదావ‌రి నీటితో నింపేందుక‌న్నారు. ఇందుకుగాను సంగారెడ్డి కాలువను 27 కిలోమీట‌ర్ల నుండి మ‌ళ్లించి శామీర్‌పేట స‌ర‌స్సు స‌మీపంలోని ర‌విల్‌కోట్ ట్యాంకుకు మ‌ళ్లించ‌నున్నారు. ఇక్క‌డి నుండి నుండి 52 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి హైద‌రాబాద్‌లోని జంట జ‌లాశ‌యాల‌కు చేర‌నుంది. అయితే ఈ 52 కిలోమీట‌ర్ల దూరాన్ని క‌వ‌ర్ చేసేందుకు ప్ర‌భుత్వం రెండు ప్ర‌త్యామ్నాల‌పై కృషి చేస్తుంది. 

స‌ముద్ర మ‌ట్టానికి 618 మీట‌ర్ల ఎత్తులో ఉన్న కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్ నుండి 545 మీట‌ర్ల సామ‌ర్థ్యం ఉన్న ఉస్మాన్ సాగ‌ర్‌కు అక్క‌డి నుండి 357.25 మీట‌ర్ల స్థాయిలో ఉన్న హిమాయ‌త్ సాగ‌ర్‌కు నీటి త‌ర‌లింపు చాలా సులువేన్నారు. వాట‌ర్ వ‌ర్స్క్ డిపార్ట్‌మెంట్ ఈ రెండు జలాశయాల మధ్య ఇప్ప‌టికే ఉన్న పైపులైన్‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసి తిరిగి తెరవడం మ‌రో ప్ర‌త్యామ్నాయంగా యోచిస్తున్న‌ట్లు చెప్పారు. అయితే సంగారెడ్డి కాలువను జంట జలాశయాలతో అనుసంధానించేందుకు మ‌రో ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా పరిశీలనలో ఉందన్నారు. 127 కి.మీ పొడ‌వైన‌ సంగారెడ్డి కాలువ యొక్క 104.250 కి.మీ పాయింట్ నుండి 22 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ సహాయంతో నీటిని జంట‌జ‌లాశ‌యాల‌కు మళ్లించడం ఓ మార్గ‌మ‌న్నారు. 

సంగారెడ్డి కాలువ పనులు ఇప్పటికే ప్రారంభమైన‌ట్లు నాయ‌క్ తెలిపారు. రవిల్‌కోట్ వ‌ద్ద గండిపేటకు నీటిని మళ్లించే కార్య‌క్ర‌మం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాట‌ర్ స‌ప్లై, సివ‌రేజీ బోర్డు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. కొండపోచమ్మ సాగర్ నుండి హైదరాబాద్ జంట జలాశయాలకు మ‌ధ్య ఉన్న 85 కిలోమీటర్ల దూరంలో జలవనరులశాఖ 27 కిలోమీటర్ల కాలువ పనులను చేప‌ట్ట‌నుండ‌గా హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్‌ఎస్‌బి మిగిలిన 52 కిలోమీటర్లను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. 

ముసీతో గోదావరి అనుసంధానం పూర్తైన తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను ఒక్కొక్కటి 3.5 టీఎంసీలతో నింపాలని జలవనరులశాఖ యోచిస్తోంది. రెండు జలాశయాలలో నీటి మట్టాలు పెరగడం వల్ల 15 నుంచి 20 కిలోమీటర్ల పరిసరాల్లోని భూగ‌ర్భ జ‌లాలు పెరుగ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. కాలుష్య కాసారం అయిన మూసీలో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు అందేవిధంగా నీటిలో ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచేందుకు కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా గోదావ‌రి నీరు మూసీలోకి విడుద‌ల చేయ‌బ‌డుతుంది. మ‌రోవైపు మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా ఎస్ఎన్‌డీపీ కింద రాష్ర్ట ప్ర‌భుత్వం అనేక మురుగునీటి శుద్ధి ప్లాంట్ల‌ను నిర్మిస్తుంది. న‌ది కాలుష్యాన్ని త‌గ్గించి శుద్ధి చేసిన నీటిని తిరిగి న‌దిలోకి విడుద‌ల చేస్తారు.