శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:49:15

కొమురెల్లి మల్లన్న నుంచి కొండపోచమ్మకు.. ఏకబిగిన మూడడుగులు

కొమురెల్లి మల్లన్న నుంచి కొండపోచమ్మకు.. ఏకబిగిన మూడడుగులు

  • కాళేశ్వరంలో భిన్నమైన ప్రక్రియకు అధికారుల కసరత్తు 
  • తుక్కాపూర్‌-అక్కారం-మర్కూక్‌ వద్ద సమాంతర ఎత్తిపోత
  • ఈ నెల 15 తర్వాత కొండపోచమ్మలోకి గోదావరి ప్రవేశం

‘ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధి పైనంతై..’ అని బమ్మెర పోతన వామనుడి విశ్వరూపాన్ని వర్ణిస్తుంటే.. అహో అని ఆశ్చర్యపోయాం..  

90 అడుగుల కిందినుంచి ఒక్కొక్క అడుగూ పైపైకి వేసుకొంటూ ఉబికుబికి వస్తున్న కాళేశ్వర గంగ.. ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడడుగులు పైకి వేసి తన విరాడ్రూపాన్ని ప్రదర్శించబోతున్నది.  

కాళేశ్వరం ప్రాజెక్టులో సప్తపదులు దాటి ఎగిసి వచ్చిన గోదావరి మరొక్క మూడడుగులు ఒకేసారి వేసి తన అంతిమ గమ్యమైన కొండపోచమ్మ సాగర్‌ను చేరుకోనున్నది. ఇప్పటివరకు చేపట్టిన ఎత్తిపోతల ప్రక్రియకు సాంకేతికంగా భిన్నమైన విధానంలో మూడు పంప్‌హౌజ్‌లను ఏకకాలంలో సమాంతరంగా ఎత్తిపోస్తూ గోదావరిని గమ్యానికి చేర్చడంతో అపర భగీరథుడి మహా జలయజ్ఞం పరిపూర్ణం కాబోతున్నది. మరో 15 రోజుల్లో ఈ అపూర్వ దృశ్యాన్ని సాకారంచేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకంగా ఖ్యాతికెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టు అనేక రికార్డులు, సాంకేతికాంశాలకు వేదిక. తాజాగా మరో అద్భుత సాంకేతిక ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. మేడిగడ్డ నుంచి ఒక్కో అడుగుతో తెలంగాణపై విస్తరిస్తున్న కాళేశ్వరగంగ.. తాజా అంకంలో ఏకబిగిన మూడడుగులు వేయడానికి సిద్ధపడుతున్నది. గతేడాది జూన్‌ 21న ప్రాజెక్టు ప్రారంభమైనప్పటినుంచి.. అధికారులు దశలవారీగా గోదావరిజలాల్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఒక్కో పంపుహౌజ్‌ను సిద్ధంచేసి.. అందులోని మోటర్ల ద్వారా  ఏడు దశల్లో కాళేశ్వర జలాలను ఎత్తిపోస్తూ రంగనాయకసాగర్‌వరకు తెచ్చారు. మరో మూడు దశల్లో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు కొండపోచమ్మ జలాశయంలోకి చేరుకొంటాయి. ఈ మూడుదశల ఎత్తిపోత మాత్రం ఒకేసారి చేయాల్సిరావడం సాంకేతికంగా ఆసక్తికర అంశం. 

సమాంతరంగా ఎత్తిపోత

రంగనాయకసాగర్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు కాళేశ్వర జలాలను నిల్వచేసే అవకాశం లేకపోవడం వల్ల ఒకేసారి మూడు దశలనూ దాటడం తప్పనిసరి. రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం, కాల్వల ద్వారా తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన కొమురవెల్లి మల్లన్న సర్జ్‌పూల్‌లోకి చేరుతున్న నీటిని.. మల్లన్న పంప్‌హౌజ్‌లోని మోటర్ల ద్వారా ఎత్తిపోయాలి. ఇవి నేరుగా అక్కారం సర్జ్‌పూల్‌లోకి చేరుతాయి. అక్కడినుంచి జలాలను ఎత్తిపోసి మర్కూక్‌ సర్జ్‌పూల్‌కు పంపించాల్సి ఉంటుంది. మర్కూక్‌ సర్జ్‌పూల్‌ మోటర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తే కొండపోచమ్మసాగర్‌లోకి చేరుతాయి. 

ఈ మధ్యలో ఎక్కడ కూడా నీటి నిల్వకు అవకాశం లేదు. కేవలం మోటర్లకు అందే నీటి పరిమాణంకోసం నిర్మించిన సర్జ్‌పూల్‌లో మాత్రమే నిల్వ ఉంటాయి. ఒక్కో సర్జ్‌పూల్‌లో ఎంత పరిమాణానికి అవకాశమున్నదో అంతే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఒక పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోసిన నీటి పరిమాణం తర్వాతి సర్జ్‌పూల్‌కు చేరుకొన్నతర్వాత అంతే పరిమాణాన్ని తర్వాత పంప్‌హౌజ్‌కు తరలించాలి. అక్కడినుంచి అదే నీటి పరిమాణాన్ని ఎత్తిపోస్తూ కొండపోచమ్మసాగర్‌లోకి తరలించాలి. అంటే ముందుగా కొమురవెల్లి మల్లన్న పంప్‌హౌజ్‌లో ఎన్ని మోటర్ల ద్వారా ఎంత పరిమాణంలో నీటిని ఎత్తిపోస్తారో.. దాని తరువాత ఉన్న అక్కారం, మర్కూక్‌ పంపుహౌజ్‌ల్లోనూ అంతే పరిమాణంలో నీటిని ఎత్తిపోయాల్సిఉంటుంది. మూడు మంప్‌హౌజ్‌లు సమాంతరంగా ఏకకాలంలో పనిచేయాల్సిందే. 


ప్రారంభమైన కసరత్తు

కొండపోచమ్మసాగర్‌కు ఒకేసారి మూడు దఫాలుగా నీటిని ఎత్తిపోయాల్సి ఉన్నందున అధికారులు భారీ కసరత్తును మొదలుపెట్టారు. ఇప్పటికే రంగనాయకసాగర్‌ నుంచి 16 కిలోమీటర్ల సొరంగం ద్వారా కొమురవెల్లి మల్లన్న సర్జ్‌పూల్‌లోకి జలాలు చేరుకొన్నాయి. ఆ పంప్‌హౌజ్‌లో 43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్ల డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లలోకి (సర్జ్‌పూల్‌- పంప్‌హౌజ్‌ మధ్య పైపులు) నీటిని నింపి, లీకేజీలను పరిశీలిస్తారు. ఎనిమిది డ్రాఫ్ట్‌ ట్యూబ్‌లలో సమాంతరంగా నీళ్లు నిండిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండాఉంటే అప్పుడు మోటర్ల ట్రయల్న్‌ మొదలుపెడుతారు. 

కొమురవెల్లి మల్లన్న పంప్‌హౌజ్‌లో ఒక మోటర్‌ ట్రయల్న్‌ కాగానే అక్కారం సర్జ్‌పూల్‌లోకి నీళ్లు చేరుతాయి. అక్కడ 27 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు మోటర్లున్నాయి. ఆ ఆరు డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ల్లోకి నీటిని పంపి పరిశీలించిన తర్వాత ఒక మోటర్‌ ట్రయల్న్‌త్రో మర్కూక్‌ సర్జ్‌పూల్‌లోకి నీళ్లు చేరుస్తారు. ఇక్కడ 34 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఆరు మోటర్లు ఉన్నాయి. వాటి డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ల్లో కూడా నీటిని నింపి పరిశీలించిన తర్వాత మోటర్‌ ట్రయల్న్‌ చేపడతారు. అంటే మొదట ఉన్న కొమురవెల్లి మల్లన్న పంప్‌హౌజ్‌లో ఎనిమిది మోటర్ల ద్వారా రోజుకు ఒక్క టీఎంసీ ఎత్తిపోత మొదలైందంటే కచ్చితంగా తదుపరి రెండు పంప్‌హౌజ్‌లలో మోటర్లను నడిపి జలాల్ని కొండపోచమ్మసాగర్‌లోకి పోయాల్సిందే.  కొమురవెల్లి మల్లన్న పంప్‌హౌజ్‌లో మొదటి మోటర్‌ ట్రయల్న్‌క్రు కనీసం వారం రోజులు పడుతుందని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15 తర్వాతనే మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్‌ ట్రయల్న్‌ మొదలయ్యే అవకాశాలున్నట్లు  అధికారులు అంచనా వేస్తున్నారు. 


logo