ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:03:10

అక్టోబర్‌లో ఎగువ మానేరుకు గోదావరి

అక్టోబర్‌లో ఎగువ మానేరుకు గోదావరి

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ వెల్లడి

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం జలాలతో రాజన్నసిరిసిల్ల జిల్లా సస్యశామలం కాబోతున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఉద్ఘాటించారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు మిషన్‌మోడ్‌లో జరిగేలా చూడాలని, అక్టోబర్‌ 15లోగా మల్కపేట రిజర్వాయర్‌ పనులు పూర్తిచేసి ఎగువ మానేరును గోదావరి జలాలతో నింపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. 

అనంతరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. 12 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సొరంగమార్గం పనుల్లో కొద్దిమీటర్లే మిగిలి ఉన్నాయన్నారు. ఆ తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పారు. ఇప్పటికే ప్యాకేజీ కింద ప్రధాన కాలువ నిర్మాణపనులు పూర్తికావచ్చినట్లు తెలిపారు. ప్రకృతితో కూడిన ఆహ్లాదకరమైన ఐదు గుట్టలను కలుపుకొని ఎక్కడాలేని విధంగా ప్యాకేజీ-9 నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. 

సెప్టెంబర్‌ చివరికల్లా జలాలు : రజత్‌కుమార్‌  

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌ ప్యాకెజ్‌-9 పనులను వచ్చే సెప్టెంబర్‌ చివరి కల్లా పూర్తిచేసి కాళేశ్వరం జలాలు అందిస్తామని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ చెప్పారు. సొరంగమార్గంలో మూడు కిలోమీటర్ల మేర ప్రయాణించి పనుల తీరును పరిశీలించారు. వానకాలం పూర్తయ్యేలోగా ఈ ప్రాంత రైతులకు కాళేశ్వరం నీళ్లు అం దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమీక్షలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ అంజయ్య, నీటి పారుదలశాఖ ముఖ్య ఇంజినీర్‌ మురళీధర్‌, శిక్షణ కలెక్టర్‌ శేక్‌బాషా, ఎస్‌ఈ ఆనంద్‌, ఆర్డీవో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo