మంగళవారం 26 మే 2020
Telangana - May 04, 2020 , 01:04:10

రంగనాయకసాగర్‌లో 1.27 టీఎంసీలు

రంగనాయకసాగర్‌లో 1.27 టీఎంసీలు

  • తూములకు గేట్లు బిగించాలని.. మంత్రి హరీశ్‌రావు ఆదేశం
  • కాల్వలు, చెరువుల పరిశీలన

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ/ చిన్నకోడూరు: రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లోకి 1.27 టీఎంసీల గోదావరి జలాలు చేరుకొన్నాయి. సోమవారం వరకు 1.50 టీఎంసీలకు నీటిమట్టం చేరుకొంటుందని అనంతరం ఎత్తిపోతను నిలిపివేస్తామని ఈఈ గోపాలకృష్ణ తెలిపారు. కుడి ఎడమ కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. మరోవైపు రంగనాయకసాగర్‌ కుడి, ఎడమ కాల్వల తూములకు యుద్ధ ప్రాతిపదికన గేట్లను బిగించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కాల్వలపై సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనులను పూర్తిచేసి చివరి ఆయకట్టు ఉన్న రైతులకు సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

అనంతరం మంత్రి సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మందపల్లి, నర్సపురం గ్రామ శివారులోని కుడి పైపులైన్‌ కాల్వ,   చెక్‌డ్యాంలో పారుతున్న నీళ్లను పరిశీలించారు. నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో రంగనాయకసాగర్‌ కుడికాల్వ ద్వారా నీళ్లు చేరడంతో గంగమ్మకు జలహారతి పట్టి పుష్పాభిషేకంచేశారు. చేర్యాల మండలం దానంపల్లిలో చెరువులు మత్తడి దుంకుతుండటంతో పూజలు నిర్వహించారు. రంగనాయకసాగర్‌ కుడికాల్వ ద్వారా 22 చెక్‌డ్యాంలు, 11 గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపుతామని     మంత్రి హరీశ్‌ చెప్పారు. ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో నీటి వృథా తగ్గి పంట దిగుబడి కూడా పెరుగుతుందన్నారు. మైనర్‌, సబ్‌ మైనర్‌ కాల్వలు త్వరితగతిన పూర్తిచేసి రైతులకు నీరందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్‌ ఆదేశించారు. 


logo