శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 10:10:11

జోరుగా మూడో మోటర్‌

జోరుగా మూడో మోటర్‌
  • తిప్పాపూర్‌ సర్జ్‌పూల్‌లో ట్రయల్న్‌ విజయవంతం
  • జలాశయంలోకి చేరిన 0.7టీఎంసీల నీరు
  • రెండ్రోజుల్లో మరో మోటరు పరీక్షకు సమాయత్తం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా తిప్పాపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి నీటి ని తరలించేందుకు జరిపిన మూడో మోటర్‌ పరీక్ష విజయవంతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి శివారులోని అన్నపూర్ణ జలాశయానికి బో యినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మోటర్ల పరీక్ష విజయవంతం కాగా, తాజాగా మూడో మోటర్‌ను పరీక్షించారు. దీంతో గోదావరి జలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌ లోకి పరుగులు తీశాయి. సోమవారం నిర్వహించిన మూడోమోటర్‌ ట్రయల్న్‌ విజయవంతమైనట్టు ఈఎన్సీ హరీరాం తెలి పారు. ఈ మోటర్‌ ద్వారా కూడా 2,836 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి దుంకినట్టు అధికారులు పేర్కొన్నారు.

సర్జ్‌పూల్‌ నుంచి..

శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి గోదావరి జలాలను తిప్పాపూర్‌ శివారులోని సర్జ్‌పూల్‌ (మహాబావి)కి తరలించి, అక్కడి నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 11న మొదటి మోటర్‌, 14న నాల్గో నంబర్‌ మోటర్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఒక్కో మోటర్‌ సామర్థ్యం 106 మెగావాట్లు కాగా, రెండో నంబర్‌ మోటర్‌ పరీక్షను మరో రెండురోజుల్లో పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు మోటర్లు పనిచేయడం ప్రారంభమైతే రోజుకు టీఎంసీ నీటిని సర్జ్‌పూల్‌ నుంచి అన్నపూర్ణ జలాశయంలోకి ఎత్తిపోయవచ్చు. అయితే ప్రభు త్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఒక్క మోటర్‌ ద్వారానే నిరవధికంగా నీటిని పంప్‌చేస్తున్నారు. దీంతో 3.5 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న అన్నపూర్ణ జలాశయంలోకి సోమవారం సాయంత్రానికి 0.7టీఎంసీల నీరు చేరిందని అధికారులు చెప్పారు. సాంకేతికంగా ఈ స్థాయి నీటి నిల్వతో అన్నపూర్ణ రిజర్వాయర్‌ నుంచి రంగనాయకసాగర్‌ జలాశయానికి నీటిని తరలించవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే చంద్లాపూర్‌ పంప్‌హౌజ్‌ వద్ద కూడా మోటర్ల ట్రయల్న్‌ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

సరస్వతి బరాజ్‌కు గోదావరి జలాలు

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఒక మోటర్‌ ను నిరంతరం నడిపిస్తున్నారు. రోజుకు 2,300 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్‌కు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం 9వ నంబర్‌ మోటర్‌ను నిలిపి వేసి, సాయంత్రం 3వ నంబర్‌ మోటర్‌ను నడిపించారు. 


logo