శనివారం 04 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:08:00

ఓర్వలేకే కాంగ్రెస్‌ విమర్శలు

ఓర్వలేకే కాంగ్రెస్‌ విమర్శలు

  • గాంధీభవన్‌లో కాదు.. సిద్దిపేట వచ్చి చూడండి
  • చెరువుల్లో గోదారమ్మ అలుగులు పారుతున్నది: మంత్రి హరీశ్‌రావు
  • సిద్దిపేటలో అమరవీరుల స్తూపానికి గోదావరి జలాలతో అభిషేకం

తొగుట: అలుపెరుగని కర్తవ్య దీక్షతో నాడు తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. నేడు పంటపొలాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పారిస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇదిచూసి ఓర్వలేకే కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని చెరువులు, కుంటలకు నీళ్లు విడుదలచేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి మంత్రి హరీశ్‌రావు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. 

కలెక్టరేట్‌ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. రాష్ట్రం సాధించుకున్న ఫలాలు నేడు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు. వేసవిలోనూ గోదావరి జలాలను చెరువులు, కుంటల్లోకి వదులుకుంటున్నామంటే అది ప్రత్యేక రాష్ట్ర ఫలితమేనని చెప్పారు. కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన తెలంగాణ ప్రాంతం.. నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలమవుతున్నదన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేవంటున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో కాదని, సిద్దిపేట చెరువు వద్దకు వచ్చి మాట్లాడాలని అన్నారు. 

ఆయన సొంతజిల్లా సూర్యాపేటకు గోదావరి నీళ్లు రావడం నిజం కాదా? అని నిలదీశారు. రూ. 25 వేలలోపు ఉన్న రైతుల రుణాలు మాఫీకోసం 20 రోజుల క్రితమే రూ.1200 కోట్లు విడుదల చేశామని, రుణమాఫీ చేయలేదన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. కరువు, కాటకాలతో తల్లడిల్లుతున్న దుబ్బాకను నాడు మిషన్‌ భగీరథ ద్వారా, నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు ఫారూఖ్‌హుస్సేన్‌, కూర రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ వేలేటి రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డేవిస్‌ పాల్గొన్నారు.


logo